Karnataka: కర్ణాటకలోని హుస్కూర్ మద్దురమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. ఆలయ రథం ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు, ఈదురుగాలులు భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
జాతరకు తీసుకువచ్చిన దొడ్డనాగరమంగళ గ్రామ రథం, చిక్కనగరమంగళ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూర్‌కు చెందిన రోహిత్ (26), బెంగళూరులోని కెంగేరికి చెందిన జ్యోతి (14) ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో లక్కసంద్రకు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Karnataka: ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై హెబ్బుగోడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా రాయసంద్ర గ్రామంలో రథం కూలిన ఘటన జరిగింది. అయితే, అప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఈదురుగాలుల ధాటికి రెండు అమాయక ప్రాణాలు బలయ్యాయి. గ్రామస్థులు ఈ ప్రమాదాన్ని తీవ్ర దిగ్భ్రాంతితో స్వీకరించారు.
