Buggana

Buggana: పాపం జగనన్న.. బుగ్గన కూడానా?

Buggana: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఆర్థిక మంత్రిగా.. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా… జగన్‌ ప్రభుత్వంలో సెకండ్ లీడర్‌గా చక్రం తిప్పిన లీడర్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. అలాంటి నాయకుడు ఇపుడు అదే ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో, అటు ప్రభుత్వంలో చక్రం తిప్పిన బుగ్గనకు వచ్చిన కష్టమేంటి?

అది ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా. అందులోనూ డోన్ నియోజకవర్గం. అక్కడి వాతావరణం ఎంత వేడిగా ఉంటుందో.. రాజకీయాలు కూడా అంతే రంజుగా సాగుతుంటాయ్. పైకి చూసేందుకు సాదా సీదాగా కనిపించినా.. డోన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానూ, ఆశ్చర్యం కలిగించేలానూ ఉంటాయ్. ఇక్కడ రాజకీయంగా చక్రం తిప్పిన నేతలు, రాష్ట్ర రాజకీయలను సైతం ఆకర్షిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటారు పొలిటికల్‌ పండితులు. గతంలో కోట్ల, కేఈ వర్గాలు ఇక్కడ చక్రం తిప్పగా… గత పదేళ్లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బుగ్గన తన మార్కు రాజకీయంతో డోన్‌లో చక్రం తిప్పారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

Buggana: గత రెండు సార్లు గెలుపు ఇచ్చిన ఉత్సాహమో, లేక జగన్ పార్టీలో బుగ్గనకున్న ప్రాధాన్యతో తెలియదు కానీ… ఉమ్మడి కర్నూల్ జిల్లాలో సర్వం తానై ఈ మాజీ మంత్రి గతంలో కథ నడిపారట. అయితే అధికారంలో ఉన్నప్పుడు నాస్టైలే వేరు, నా స్థాయి వేరు అన్నట్టు పార్టీలోని కింది స్థాయి క్యాడర్‌తో టచ్ మీ నాట్.. అన్నట్టు వ్యవహరించేవారట ఈ మాజీ అమాత్యులవారు. ఈ వ్యవహారశైలే గత ఎన్నికల్లో పార్టీ కొంప ముంచిందని ఫ్యాన్ పార్టీ క్యాడర్ బహిరంగంగానే బుగ్గనపై విమర్శలు గుప్పిస్తున్నారట.
ఎన్నికలు ముగిసి, ఓటమి పాలైనా సరే… బుగ్గనలో ఎలాంటి మార్పు రావడం లేదని ఆందోళన చెందుతోంది బుగ్గననే నమ్ముకున్న ఫ్యాన్ పార్టీ క్యాడర్.

అసలు నియోజకవర్గంలో పార్టీ పరిస్తితి ఏమిటి..? అధికార పార్టీ నేతల వల్ల క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలు ఎమిటి? క్యాడర్ జారిపోకుండా ఎం చేయాలి..? అన్న అంశాలపై బుగ్గన దృష్టి పెట్టకపోవడంతో.. చుక్కాని లేని నావలా తయారైందట అక్కడ పార్టీ క్యాడర్ పరిస్థితి. ఓటమి తర్వాత బుగ్గన తన సొంత పనులకు పరిమితం అయ్యాడని, ఇది రాజకీయ నాయకుడి లక్షణం కాదని అంటున్నారట స్థానిక నేతలు. బుగ్గన తాను అనుకున్నది చేయడం మినహా, క్యాడర్ అభిప్రాయాలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అప్పట్లో, ఇప్పట్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీకి, క్యాడర్‌కు భరోసాగా నిలవాల్సిన బుగ్గన, అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ వైసీపీకి తీరని నష్టం చేస్తోందని, పద్దతి మార్చుకోకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని క్యాడర్ గగ్గోలు పెడుతోందనే వార్తలు వస్తున్నాయి.

Also Read:  Madhya pradesh: అంత్య‌క్రియ‌లు చేసిన ఏడాదిన్న‌ర‌కు ప్ర‌త్య‌క్ష‌మైన మ‌హిళ‌

Buggana: ఎన్నికల సమయంలో వైసీపీలోని బలమైన క్యాడర్ పసుపు పార్టీలోకి వెళ్లిపోగా… మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. ఆ మధ్య మున్సిపల్ పార్క్ విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలపై హడావిడి చేసిన బుగ్గన, ఆ తర్వాత నియోజకవర్గంలో నల్లపూసై పోయాడని, అడపా దడపా ప్రెస్ మీట్లలో దర్శనమివ్వడం మినహా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం లేదని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారట. అంతేగాక మొన్నటి ఫీజు పోరు ర్యాలీలో బుగ్గన పాల్గొనపోవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ పరిస్థితులను చూస్తే.. అసలు ఈయనకు డోన్‌లో రాజకీయం చేసే ఆలోచన ఉందా? లేదా అన్న అనుమానం ఆ పార్టీ క్యాడర్లో కలుగుతోందనే ప్రచారం సెగ్మెంట్‌లో జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు మౌత్ పీస్‌గా ఉండే బుగ్గన, తన సొంత నియోజకవర్గంలో సైలెంట్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రస్తుత రాజకీయాల్లో మేధావి వర్గంగా, మంచి మాటకారిగా, ఆర్థిక అంశాలపై, రాష్ట్ర స్థితిగతులపై అవగాహన ఉన్న బుగ్గన మౌనం వెనక ఏమైనా వ్యూహం ఉందా..? సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా..? అనే సందేహాలు లోకల్ క్యాడర్‌ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయట. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. లేనిపోని సమస్యల్లో ఇరుక్కోకూడదని ముందు జాగ్రత్తగా బుగ్గన సైలెంట్ అయిపోయి ఉండొచ్చని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా… ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ప్రజల పక్షాన ప్రభుత్వాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఉంది. ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రజలకు సేవ చేస్తాం…. సేవ పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తాం…. ఓడిస్తే సైలెంట్‌గా సైడై పోతాం అన్న తీరు.. ప్రజాస్వామ్యం హర్షించదు అన్న విషయాన్ని సోకాల్డ్ బుగ్గన లాంటి పొలిటికల్ లీడర్స్ గుర్తుంచుకోవాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *