KCR: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (మార్చి 7న) భేటీ అయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసంలో ఆయన వారితో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలతో చర్చించి, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించే అంశాలపై కూడా వారితో డిస్కషన్ చేస్తారని తెలిసింది.
KCR: ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిలో బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. అయితే మరో స్థానం గెలవాలంటే ఇంకా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాల్సి ఉంటుంది. కానీ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.
KCR: అదే విధంగా ఏప్రిల్ 10న భారీ బహిరంగ సభను నిర్వహించే అంశంపైనా ఇదేరోజు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చిస్తారని తెలిసింది. హైదరాబాద్లో లేదా వరంగల్ నగరంలోనైనా సభ నిర్వహించేందుకు వారితో చర్చిస్తారని తెలిసింది. ఆ సభతో కేసీఆర్ మళ్లీ జనంలోకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటారని, ఆయా సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాన్ని రూపొందిస్తారని తెలుస్తున్నది.

