Champions Trophy 2025: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమై అతని స్థానంలో యువ బౌలర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, గత కొన్ని నెలలుగా ఎన్సీఏ పర్యవేక్షణలో ఉన్న బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. మెడికల్ రిపోర్ట్లు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ, సెలక్షన్ కమిటీ అతనిని జట్టులో తీసుకోలేదు. దీనిపై అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అందుకు కారణం ఏమిటో చూద్దాం..!
ఐదు వారాల పాటు ఎన్సీఏ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న బుమ్రా, కండిషనింగ్ కోచ్ రజనీకాంత్, ఫిజియో తులసి మార్గదర్శకత్వంలో తన రిహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నాడు. ఎన్సీఏ చీఫ్ నితిన్ పటేల్ బీసీసీఐకి బుమ్రా ఆరోగ్య స్థితిపై నివేదిక పంపారు. ఈ నివేదిక ప్రకారం, బుమ్రా తన రిహాబ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడని, అతని మెడికల్ రిపోర్ట్ కూడా మంచిదిగా ఉందని పేర్కొన్నారు.
అయితే, టోర్నమెంట్ ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా బౌలింగ్ చేయడానికి ఫిట్ ఉంటాడో లేదో అనే అనుమానం ఉండడంతో, సెలక్టర్లు ఎటువంటి ప్రమాదాన్ని తీసుకోలేదు. ఈ విషయంలో అంతిమ నిర్ణయాన్ని ఎన్సీఏ చీఫ్ అజిత్ అగార్కర్‌కు వదిలేశారు. ఫిట్‌నెస్ గురించి పూర్తి నిర్ధారణ లేకపోతే, ఎవరూ అతనిని జట్టులో చేర్చే ప్రమాదాన్ని తీసుకోరు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
Also Read: Kakarakaya Juice: ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగితే.. ఆ సమస్యలకు చెక్..
అంటే, మెడికల్ రిపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ, టోర్నమెంట్ ప్రారంభానికి బుమ్రా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండడం అనుమానంగా మారింది. అతనిని జట్టులో తీసుకున్నప్పుడు తీవ్ర గాయాలు తిరిగి రావొచ్చనే భయంతో సెలక్షన్ కమిటీ అతనిని ఎంపిక చేయలేదు.
పైగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఐపీఎల్ తర్వాత అతికీలకమైన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. బుమ్రా లాంటి ప్లేయర్ ను ఒక్క టోర్నమెంట్ కోసం రిస్క్ తీసుకొని బరిలోకి దింపితే అతను తర్వాత ముఖ్యమైన మ్యాచ్లకు అందుబాటులో లేకపోతే మొదటికే మోసం వస్తుంది. పైగా వెన్నునొప్పి గాయం తిరగబెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఒక బౌలర్ పూర్తి ఫిట్నెస్ తో టోర్నమెంట్ మొత్తం ఆడుతాడని 100% కచ్చితంగా ఉంటేనే అతనిని జట్టులోకి తీసుకోవడం మంచిది. లేనిపక్షంలో గాయం తిరగబెట్టి అతను ఒక ఏడాది అంతా క్రికెట్ దూరమయ్యే అవకాశాలు ఉంటాయి పైగా భవిష్యత్తులో కూడా అది అతనిని మాటిమాటికి ఇబ్బంది పెట్టవచ్చు.
గతంలో ఇలాగే 2022 టీ20 ప్రపంచకప్ ముందు బుమ్రాను జట్టులో తీసుకోవడంపై ఎన్సీఏ విమర్శలు ఎదుర్కొంది. ఆ సిరీస్ మధ్యలోనే బుమ్రా గాయపడి, ఏకంగా ప్రపంచకప్ నుండే బుమ్రా తప్పుకున్నాడు. దీనితో టీమ్ ఇండియా సెమీస్‌లో ఓడిపోయింది. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ, బీసీసీఐ అధికారి ఒకరు ఇలాంటి అనుభవాల నేపథ్యంలోనే తాము బుమ్రా విషయంలో ఎలాంటి తొందరపాటుకు గురి కాలేదని తెలిపారు.