Mahakumbh Mela 2025: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు మీరు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు, ఈ విషయాలు తెలుసుకొని వెళ్లాల్సిందే. లేకుంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ దారిబట్టారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నదే కానీ, తగ్గడం లేదని తెలుస్తున్నది. తొక్కిసలాట జరిగిన నాటి నుంచి నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వచ్చే సంఖ్యను బట్టి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
Mahakumbh Mela 2025: ఇప్పటివరకు మహాకుంభమేళాకు 44 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ నెల 26వ తేదీతో మహాకుంభమేళా ముగుస్తుంది. దీంతో నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. నిన్న, మొన్న సుమారు 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభన ఏర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే రెండు రోజులుగా అంటే 48 గంటలకు పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు.
Mahakumbh Mela 2025: సమీపంలోనే వాహనాలను వదిలేసి భక్తులు కాలినడకన ప్రయాగ్‌రాజ్ వైపు తరలివెళ్తున్నారు. గంటలపాటు నడుస్తూ అవస్థలు పడుతున్నారు. వసతి, ఇతర సౌకర్యాలు లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ దరిమిలా అక్కడి నిర్వాహకులు కూడా భక్తుల రద్దీ కారణంగా చేతులెత్తేశారని చెప్తున్నారు. దీంతోపాటు ప్రయాగ్‌రాజ్‌తోపాటు కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాలకూ భక్తుల రద్దీ పెరుగుతుంది.
Mahakumbh Mela 2025: రోజూ లక్షలాది మంది భక్తులు రాకతోపాటు, నిన్న, మొన్న (ఫిబ్రవరి 9,10) వచ్చిన భక్తులతో ప్రయాగ్‌రాజ్ సమీప ప్రాంతాలు, మహాకుంభమేళా జరిగే త్రివేణీ సంగమ ఆవరణలు అంతా తీవ్ర రద్దీ నెలకొన్నది. వాహనాలు కిలోమీటర్ల దూరంలో చిక్కుకోవడంతో వారు చేరుకునే పనిలో ఉన్నారు. దీంతో ఇంకా రెండు రోజులపాటు ఈరద్దీ ఇలాగే కొనసాగుతుందని, ఈ రెండురోజులపాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ సూచించారు. దీంతో రద్దీ తగ్గే వరకూ ప్రయాణాలను వాయిదా వేసుకొంటే కొంత మంచిదని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ఆరద్దీలో ఇరుక్కొని అవస్థలు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.