Etala rajendar: కేసీఆర్ ఫోన్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్..

Etala rajendar: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, మళ్లీ కలిసి పని చేద్దామని ఆయన ఆహ్వానించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని ఈటల పూర్తిగా కొట్టిపారేశారు.

ఈటల మాట్లాడుతూ, తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తనపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన గురించి స్పష్టంగా అభిప్రాయాలు వెల్లడించినా, కొందరు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి అవాస్తవ కథనాలను వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు.

తనపై ఇలాంటి దుష్ప్రచారాలు కొనసాగితే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ మారడం పిల్లల ఆట కాదని, తాము బాధ్యత గల రాజకీయ నాయకులమని అన్నారు. “వాళ్లది వాళ్ల పార్టీ, మాది మా పార్టీ. బీఆర్ఎస్‌ను ఓడించి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం,” అని స్పష్టం చేశారు.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కూడా ఈటల విమర్శలు చేశారు. “గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కులగణన చేపట్టినా శాస్త్రీయత లోపించింది. నిజమైన గణన చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీసీ-ఈ గ్రూపును తీసుకొచ్చారని ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. “అంతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూపులో ఉండేవి. కులగణన జరిపే ముందు తెలంగాణలో ఉన్న కులాలను గుర్తించడం అవసరం,” అని చెప్పారు.

తన విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ, విద్యార్థి సంఘాల్లో చురుకుగా పాల్గొన్నానని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యను అభ్యసించానని చెప్పారు. విద్యార్థుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామ్యమయ్యానని, ఇప్పటికీ వారి కోసం కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *