ED Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హాజరయ్యారు. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ కార్యాలయం లోపలికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఈ దశలో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు యత్నించారు. పలువురు వ్యాన్లలో తరలించారు.
ED Case: కేటీఆర్ విచారణకు హాజరవుతారన్న కారణంతో ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ వచ్చిన సమయంలో కూడా భారీగా శ్రేణులు చేరడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. అక్కడికి మహిళలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేటీఆర్‌ను వాహనంలో లోనికి అనుమతించగా, బయటే ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఉన్న పలువురిని వ్యాన్లలో తరలించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మరికొందరిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు.
ED Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను మధ్యాహ్నం దాటే వరకూ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఏ2, ఏ3గా ఉన్న అధికారులు అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. వారి స్టేట్‌మెంట్ల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. అరెస్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొనే అక్కడికి భారీగా చేరుకున్నట్టు సమాచారం.

