Daaku Maharaaj: జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’కు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్యం చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసింది. అనంతపూర్ లో అనివార్య కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపలేకపోయామని, ఆ లోటును తీర్చుతూ ఇదే వారంలో అక్కడే మూవీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలిగితే ఇదే నెల 17న ‘డాకు మహారాజ్’ హిందీ, తమిళ వర్షన్స్ ను రిలీజ్ చేస్తామని అన్నారు. రెండేళ్ళ క్రితం తాను తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ను ప్రేక్షకులు ఆదరించారని, ఇప్పుడు అదే సంక్రాంతి సీజన్ కు వచ్చిన ‘డాకు మహారాజ్’కు సక్సెస్ ఇచ్చారని దర్శకుడు బాబీ చెప్పారు. ఈ విజయాన్ని తన బర్త్ డే కానుకగా భావిస్తున్నట్టు ప్రగ్యా జైస్వాల్ తెలిపారు. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ హర్షం వ్యక్తం చేశారు.