Mumbai

Mumbai Torres Jewellers Fraud: నమ్మించి నట్టేట ముంచేశారు.. బంగారంపై పెట్టుబడి అంటూ కోట్లు కొల్లగొట్టేశారు

Mumbai Torres Jewellers Fraud: మహారాష్ట్రలో ఓ ప్రముఖ జ్యువెలరీ గ్రూప్ పెట్టుబడిపై అధిక వడ్డీకి హామీ ఇచ్చి వందలాది మంది కస్టమర్లను మోసగించినట్లు వెల్లడైంది. ముంబై, మహారాష్ట్రకు చెందిన జ్యువెలరీ గ్రూప్ ‘టారస్’ గత ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో ఆరు శాఖలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. వీరి ఓపెనింగ్ హంగామా చూసి ప్రజలంతా విపరీతంగా ఆకర్షితమయ్యారు.

కొన్ని రోజుల తరువాత టారస్ తమ ఖాతాదారులకు వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టింది. ఆ విధంగా, 52 వారాల పాటు డబ్బు పెట్టుబడి పెట్టిన వారికి 6 శాతం వడ్డీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వందల మంది పెట్టుబడులు పెట్టారు. చాలామంది తమ డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందారు.

ప్రజల్లో నమ్మకం కుదిరింది. సరిగ్గా దీనికోసం ఎదురుచూసిన జ్యువెలరీ గ్రూప్ సీఈవో తౌసీబ్ రియాజ్ ఏడు రోజుల క్రితం యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. గత 5వ తేదీలోపు పెట్టుబడి పెట్టిన వారికి 11 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు ఆ వీడియోలో తెలిపారు.

Mumbai Torres Jewellers Fraud: దీంతో వేలాది మంది ‘టారస్’ జ్యువెలర్స్‌లో పెట్టుబడులు పెట్టారు. వేతన జీవులు, చిన్న వ్యాపారులు, పేద – మధ్యతరగతి వారు అధిక రాబడి కోసం తమ సేవింగ్స్ మొత్తం ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు.

రెండురోజుల క్రితం ‘టారస్’ దుకాణాలు తెరుచుకోకపోవటం చూసి ఇన్వెస్టర్లు అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టోర్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, స్టోర్ ఇన్‌ఛార్జ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ‘టారస్’ బృందం ఓ వీడియోను విడుదల చేసింది. కొందరు ఉద్యోగులతో కలిసి సీఈవో భారీ మోసానికి కుట్ర పన్నారని అందులో పేర్కొన్నారు. దాదర్ బ్రాంచ్ షాపులోకి 100 మందికి పైగా వ్యక్తులు ప్రవేశించి దుకాణాన్ని దోచుకుని నగలను దోచుకున్నారని, వారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనుషులని ఆ వీడియోలో ఆరోపించారు.

ఇప్పుడు తమ సేవింగ్స్ అంతా పెట్టుబడి పెట్టినవారు లబోదిబో మంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *