Lotus Park

Lotus Park: లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పార్కు స్థలం వేలాన్ని నిరసిస్తూ స్థానికుల ఆందోళన.. జేసీబీలు, చెట్ల నరికివేత అడ్డగింత!

Lotus Park: హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 (ఎమ్మెల్యే కాలనీ) సమీపంలోని లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టడాన్ని నిరసిస్తూ స్థానిక కాలనీవాసులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

స్థలాన్ని విక్రయానికి సిద్ధం చేసే క్రమంలో అధికారులు భారీ జేసీబీలను రంగంలోకి దించి భూమిని చదును చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కు పరిధిలో దశాబ్దాల నాటి విలువైన చెట్లను అధికారులు నరికివేస్తుండటంతో స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని పంచుతున్న పచ్చదనాన్ని నాశనం చేస్తూ పార్కు స్థలాన్ని వేలం వేయడం ఎంతవరకు సమంజసమని కాలనీవాసులు ప్రశ్నించారు.

పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న స్థానికులు జేసీబీలకు అడ్డుగా నిలబడి, చెట్ల నరికివేత పనులను నిలిపివేశారు. పనులను కొనసాగించేందుకు ప్రయత్నించిన అధికారులకు, అడ్డుకున్న కాలనీవాసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే ఈ వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, పార్కులోని పచ్చదనాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *