Bhogi Review

Bhogi Review: కథ కంటే కత్తులకే ఎక్కువ పని చెప్పిన సంపత్ నంది..!

Bhogi Review:

  • చిత్రం: భోగి (Bhogi)
  • నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, శరత్ లోహితశ్వ, అవినాష్, లాల్ తదితరులు
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ అరోకియా
  • నిర్మాత: కె.కె. రాధామోహన్ (శ్రీ సత్యసాయి ఆర్ట్స్)
  • రచన, దర్శకత్వం: సంపత్ నంది
  • విడుదల తేదీ: నవంబర్ 27, 2026

ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ వంటి డీసెంట్ సినిమాలతో ఆకట్టుకున్న శర్వానంద్, ఈసారి మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామాతో నేడు (నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1960ల కాలం నాటి తెలంగాణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా శర్వాకు వరుసగా మూడో విజయాన్ని అందించిందా? సంపత్ నంది తన మార్క్ చూపించారా? తెలుసుకుందాం.

కథేంటంటే..

1960వ దశకంలో తెలంగాణ ప్రాంతంలోని ‘బొగ్గులగుట్ట’ అనే మారుమూల గ్రామంలో గంగ (శర్వానంద్) కమ్మరి వృత్తి చేసుకుంటూ, తన ఐదుగురు చెల్లెళ్లు, పెళ్లైన అన్నయ్యతో కలిసి ప్రేమానురాగాలతో జీవిస్తుంటాడు. ఆ ఊరి పెద్ద పటేల్ (శరత్ లోహితశ్వ) చెప్పిందే అక్కడ వేదం; ఆపద వచ్చిన ప్రతిసారీ పటేల్ పూజలు చేసి ఊరిని కాపాడతాడని గ్రామస్థులంతా గుడ్డిగా నమ్ముతుంటారు.

ఒకరోజు గంగ అన్నయ్యకు అమ్మవారు పోసి మంచాన పడటంతో, పటేల్ పిలిచి గంగకు, కొందరు పాలెగాళ్లకు ఒక రహస్య పనిని అప్పగిస్తాడు. ఆ పని చేసే క్రమంలో పటేల్ మరియు పూజారి (అవినాష్) మూఢనమ్మకాల పేరుతో చేస్తున్న ఓ భయంకరమైన అరాచకం గంగ కంటపడుతుంది. ఆ నిజం తెలిశాక గంగ కుటుంబానికి ఎదురైన ముప్పు ఏంటి? ఊరంతా భయపడే పటేల్‌కు గంగ ఎలా ఎదురుతిరిగాడు? ఈ కథలో కందుల సులోచన రాణి (అనుపమ పరమేశ్వరన్), మందారం (డింపుల్ హయాతి) పాత్రల నేపథ్యమేంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ (కథనం ఎలా ఉందంటే..)

ఈ మధ్యకాలంలో కథలో బలమైన భావోద్వేగాల కంటే కత్తులకు, రక్తపాతానికే దర్శకులు ఎక్కువ పని చెబుతున్నట్లు కనిపిస్తోంది. బలమైన ఎమోషన్‌తో ముడిపడిన హింసను ప్రేక్షకులు ఆదరిస్తారు కానీ, కేవలం షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా హింసను జొప్పిస్తే అది ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది—‘భోగి’ విషయంలో సరిగ్గా అదే జరిగింది.

ఒక ఊరు, కళ్లలోకి చూసి మాట్లాడటానికి కూడా జనం భయపడే ఒక నియంత లాంటి ఊరి పెద్ద, హీరో అన్నయ్యకు జరిగే భారీ నష్టం, దానికి ప్రతీకారం, చివర్లో ఓ ట్విస్ట్.. ఇదంతా వింటుంటే అచ్చం ‘రంగస్థలం’ కథ గుర్తుకురాక మానదు! సంపత్ నంది ఆ కథకు తెలంగాణ నేపథ్యం, అన్న సెంటిమెంట్ బదులు చెల్లెళ్ల సెంటిమెంట్‌ను జోడించి ‘భోగి’ని మలిచారు. సినిమా ఆరంభంలో బొగ్గులగుట్ట గ్రామ వాతావరణం, పటేల్ ఎలివేషన్, గంగ కుటుంబ నేపథ్యం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే పాటలతో మొదటి అరగంట ఆసక్తికరంగానే మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే పటేల్ అసలు రూపం హీరోకు తెలుస్తుందో, అక్కడి నుంచి కథనం మొత్తం ఊహకందేలా (Predictable) సాగుతుంది.

ప్రతినాయకుడి ముఖాన్ని ప్రీ-ఇంటర్వెల్ వరకు చూపించకుండా చేతులు, కాళ్లు మాత్రమే చూపిస్తూ నడిపిన సస్పెన్స్ తెరపై పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంటర్వెల్ సమయానికే సెకండాఫ్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడికి ఒక అంచనా వచ్చేస్తుంది. ఇక ద్వితీయార్థంలో అవసరం లేని సన్నివేశాలు, సుదీర్ఘంగా సాగదీసిన యాక్షన్ ఎపిసోడ్లు, మితిమీరిన రక్తపాతం తప్ప బలమైన ఎమోషన్స్ పండలేదు. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఒక ట్విస్ట్, టైటిల్‌కు ఇచ్చే జస్టిఫికేషన్ కాస్త పర్వాలేదనిపించినా, అప్పటికే ఆలస్యమైపోయిందనే భావన కలుగుతుంది. అయితే సంపత్ నంది రాసిన కొన్ని పదునైన డైలాగులు (“ఆడదానికి అందం వరం కాదు శాపం.. అనుభవం లేని వాడు కూడా అనుభవించాలని చూస్తాడు”, “సస్తే శవం అయితా.. ఒకవేళ చావుల్ని ఆపితే చరిత్ర అవుతా”) బాగా పేలాయి.

ఎవరెలా చేశారంటే..

గంగ పాత్రలో శర్వానంద్ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపిస్తూనే, చెల్లెళ్లతో వచ్చే ఎమోషనల్ సీన్లలో, యాక్షన్ ఘట్టాల్లో తన కష్టాన్ని తెరపై చూపించారు. తెలంగాణ యాసను కూడా బాగానే పలికారు. సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. కీలక పాత్రలో కనిపించిన డింపుల్ హయాతి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నారు, కొన్ని మంచి డైలాగులు ఆమెకు దక్కాయి. అయితే ప్రధాన విలన్ పటేల్ పాత్రలో శరత్ లోహితశ్వ ఎంపిక అంతగా అతకలేదు; ఆ పాత్రకు కావాల్సిన కఠినత్వం, క్రూరత్వం లోపించాయి. అవినాష్, లాల్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు ప్రధాన బలం కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ. 1960ల నాటి తెలంగాణ పల్లె వాతావరణాన్ని, ముఖ్యంగా రాత్రి వేళల్లో చిత్రీకరించిన సన్నివేశాలను ఆయన అద్భుతంగా కెమెరాలో బంధించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి కానీ, నేపథ్య సంగీతం (BGM) మాత్రం చాలా చోట్ల లౌడ్‌గా, ఇబ్బందికరంగా అనిపించింది. ఎడిటింగ్ మొదటి భాగంలో ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌లో కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

  • శర్వానంద్ నటన, ఎమోషనల్ సీన్స్
  • కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ & 1960ల విలేజ్ సెటప్
  • భీమ్స్ పాటలు, అక్కడక్కడా పేలిన డైలాగులు

మైనస్ పాయింట్స్

  • ‘రంగస్థలం’ ఛాయలతో రొటీన్‌గా, ఊహకందేలా సాగే కథనం
  • మితిమీరిన హింస, రక్తపాతం
  • సాగదీసిన సెకండాఫ్ & లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

పంచ్ లైన్: మితిమీరిన హింసతో సహనాన్ని పరీక్షించిన ‘భోగి’!

రేటింగ్: 1.5 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *