Kavitha

Kavitha: కేటీఆర్ గడ్డం లుక్‌పై యాంకర్ కోషన్ కి .. కవిత ఆన్సర్ ఇదే..!

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నాయకత్వంపైనా, సొంత తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌లపైనా సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పిన కవిత, తమ పార్టీ టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని, ఇక తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల వాళ్లు ఇంకా ఏం సాధిస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

గతంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ కవిత అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఆరోగ్యంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయించారని, తనకు క్యాన్సర్ ఉందని, త్వరలోనే చనిపోతానంటూ ప్రచారం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం గతంలో కేసీఆర్ వద్దకు వెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించడాన్ని తెలంగాణ సమాజమంతా ఐక్యంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో కేటీఆర్ కొత్త గడ్డం లుక్‌పై యాంకర్ అడిగిన ప్రశ్నకు కవిత ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “కేటీఆర్ గడ్డంతో బాగున్నారా లేక గడ్డం లేకపోతే బాగున్నారా?” అని యాంకర్ అడగగానే కవిత చిరునవ్వుతో రెండు చేతులు జోడించి ‘జై తెలంగాణ’ అని నమస్కరించారు. ఆయన మీ సోదరుడే కదా, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ఉంటుంది కదా అని యాంకర్ మళ్లీ అడగగా.. ఏమాత్రం తడుముకోకుండా ‘నో ఒపీనియన్’ అంటూ ఒక్క మాటలో ఆ అంశానికి ముగింపు పలికారు.
అలాగే జయలలిత స్టైల్‌లో వేషధారణ మార్చుకున్నారనే చర్చపై స్పందిస్తూ.. తాను అధికారం కోసం ఎప్పుడూ ఆహార్యం మార్చుకోలేదని చెప్పారు. గతంలో జాగృతి పెట్టిన కొత్తలో జీన్స్, కుర్తా వేసుకునేదాన్నని, కానీ ఇప్పుడు 48 ఏళ్ల వయసులో ఒక రాజకీయ పార్టీని నడిపిస్తూ ప్రజలతో మమేకమయ్యేటప్పుడు అందుకు తగ్గట్టుగా ఉండాలని వివరించారు. తాను ఒక సాధారణ సైనికుడిని కాదని, సైన్యాన్ని నడిపించే ‘జనరల్’ని అని కవిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చివరగా తెలంగాణ ప్రజలకు నీళ్లు ఏవో, పాలు ఏవో గుర్తించే గొప్ప రాజకీయ చైతన్యం ఉందని, రాష్ట్రానికి ఎవరు వస్తే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *