Drug Free Punjab: 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పటి పాత మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ (BJP) మరియు శిరోమణి అకాలీదళ్ (SAD) మళ్లీ చేతులు కలిపాయి. మంగళవారం (నవంబర్ 24, 2026) గురు నానక్ దేవ్ జయంతి (గురు పర్వ్) పర్వదినాన న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. మంగళవారం నుంచే అకాలీదళ్ అధికారికంగా ఎన్డీయే (NDA) భాగస్వామిగా పనిచేస్తుందని అమిత్ షా వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ నేతృత్వంలో అకాలీదళ్ తమకు అత్యంత పురాతన మిత్రపక్షమని గుర్తుచేసుకున్నారు. గతంలో కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ, ఇప్పుడు ఆ బంధం మళ్లీ పునరుద్ధరించబడటం సంతోషంగా ఉందని అన్నారు. అకాలీదళ్ తిరిగి రావడంతో ఎన్డీయే పరిపూర్ణమైందని పేర్కొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పంజాబ్ నుంచి మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, అవినీతి అంతం, జాతీయవాద శక్తుల బలోపేతం మరియు రైతుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని అమిత్ షా స్పష్టం చేశారు.
ముఖ్యంగా 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఆయన గడువు ప్రకటించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మూడు నెలల్లో డ్రగ్స్‌ను అరికడతామని చెప్పిన ఆప్ ప్రభుత్వం ఆ సమస్యను అలాగే వదిలేసిందని అమిత్ షా విమర్శించారు. సిక్కు గురువులను అవమానించే వారిని ఏమాత్రం సహించబోమని, హిందూ-సిక్కు సోదరభావాన్ని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ, ఇది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదని, తమ మధ్య ఉన్న భావోద్వేగ బంధమని అభివర్ణించారు. పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ ఈ బంధాన్ని నిర్మించారని గుర్తుచేశారు. పంజాబ్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ అవసరమని, డ్రగ్స్ నిర్మూలన, అవినీతి అంతం, రైతుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని బాదల్ తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ, అకాలీదళ్‌తో పొత్తు సహజమైన భాగస్వామ్యమని, పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేస్తాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు విషయాన్ని సరైన సమయంలో పరస్పర చర్చల ద్వారా ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా, 2020లో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగగా, ఆ చట్టాల రద్దు తర్వాత సుమారు ఆరేళ్ల విరామం అనంతరం మళ్లీ ఇరు పార్టీలు ఒక్కటయ్యాయి.
