TGSRTC: రోజూ ఆఫీసులకు, కాలేజీలకు బస్సుల్లో వెళ్లే సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది! ఇప్పటికే ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్న ఆర్టీసీ.. ఇప్పుడు నెలవారీ సీజన్ టికెట్ (Monthly Bus Pass) తీసుకునే మహిళలు, పురుషులకు కూడా భారీ రాయితీలను ప్రకటించింది. పాస్ ధరలను తగ్గించడంతో పాటు, ఆదివారాల్లో ఉచిత ప్రయాణం, అదనపు వ్యాలిడిటీ వంటి సరికొత్త ఆఫర్లను నేటి (శనివారం) నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది! అసలేంటీ కొత్త ఆఫర్లు? మన జేబుకు ఎంత డబ్బు మిగులుతుందో తెలుసుకుందాం!
1. సగం ధరకే డీలక్స్ & ఈ-డీలక్స్ పాస్‌లు!
పురుషులకు 20 రోజుల ఖర్చుతోనే పాస్: పురుష ప్రయాణికులకు కూడా 20 రోజుల ప్రయాణ ఖర్చుతోనే నెలవారీ పాస్ జారీ చేయనున్నారు.
దూరం పరిమితి ఎత్తివేత & టోల్ ఛార్జీల తగ్గింపు: ఇప్పటివరకు గరిష్టంగా 50 కిలోమీటర్ల దూరానికి మాత్రమే నెలవారీ పాస్‌లు ఇచ్చేవారు. ఇకపై ఆ నిబంధనను ఎత్తివేసి ఎంత దూరానికైనా డీలక్స్ నెల పాస్ తీసుకునే ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు, టోల్‌ప్లాజా ఛార్జీలను 25 రోజులకు బదులుగా ఇకపై 20 రోజులకు మాత్రమే లెక్కించనుండటంతో పాస్ ధరలు మరింత తగ్గనున్నాయి.
2. ఆదివారాల్లో సిటీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం!
-
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో నెలవారీ సిటీ పాస్ కలిగిన ప్రయాణికులు ప్రతి ఆదివారం (Sunday) అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
-
అయితే ఈ సండే ఫ్రీ ఆఫర్ ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు, హైదరాబాద్‌లో నడిచే ‘పుష్పక్’ ఎయిర్పోర్ట్ సర్వీసులకు వర్తించదు.
3. అత్యవసరమైతే రూ. 20తో ‘కాంబి టికెట్’ (Combi Ticket) సౌకర్యం!
-
ప్రతి ప్రయాణానికి అదనంగా కేవలం రూ. 20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే చాలు..
-
పల్లెవెలుగు నెల పాస్ ఉన్న పురుషులు ఎక్స్‌ప్రెస్, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
-
ఎక్స్‌ప్రెస్ నెల పాస్ ఉన్నవారు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో వెళ్లొచ్చు. (పల్లెవెలుగు పాస్‌తో డీలక్స్ బస్సులకు అనుమతి లేదు).
4. ఒకేసారి ఎక్కువ నెలల పాస్ తీసుకుంటే అదనపు రోజులు & లగ్జరీ బస్సుల్లో డిస్కౌంట్!
-
ఎక్స్ట్రా వ్యాలిడిటీ: ఒకేసారి 2 నెలల సీజన్ టికెట్ తీసుకుంటే అదనంగా 5 రోజులు, 3 నెలల పాస్ తీసుకుంటే అదనంగా 10 రోజుల వ్యాలిడిటీ ఫ్రీగా లభిస్తుంది.
-
సూపర్ లగ్జరీ బస్సుల్లో 10% రాయితీ: నెలవారీ పాస్ హోల్డర్లు తమ రెగ్యులర్ రూట్ కాకుండా తెలంగాణలో ఎక్కడికైనా సరే సూపర్ లగ్జరీ లేదా ఆపై తరగతి బస్సుల్లో ప్రయాణిస్తే బేసిక్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
