SM Srinivasan: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని తన అద్భుత చిత్రకళతో ఇంటింటా కొలువుదీరేలా చేసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తన స్వగృహంలో గురువారం తుదిశ్వాస విడిచారు. కోట్లాది మంది భక్తుల పూజా మందిరాలలో కొలువై పూజలందుకుంటున్న ఏడుకొండలవాడి చిత్రపటానికి ప్రాణం పోసిన ఆ అద్భుత కుంచె ఆగిపోవడంతో ఆధ్యాత్మిక, చిత్రకళా లోకంలో విషాదం అలముకుంది.
తమిళనాడులోని కోవిల్పట్టికి చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నారు. ఆయనలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), 1970వ సంవత్సరంలో ఆయనకు ఒక అరుదైన, అత్యంత పవిత్రమైన అవకాశాన్ని కల్పించింది. సాక్షాత్తు తిరుమల ఆనంద నిలయం గర్భగుడిలోకి వెళ్లి, మూలవిరాట్టును నేరుగా వీక్షించి చిత్రించే మహాభాగ్యం ఆయనకు దక్కింది. ఆలయంలోని దీపాల వెలుగులో మెరిసిపోతున్న స్వామివారిని తన్మయత్వంతో దర్శించుకున్న శ్రీనివాసన్, భక్తుల కోసం స్వామివారి రెండు అద్భుత రూపాలను ఆవిష్కరించారు.
ఒకటి కిరీటం, హారాలు, వజ్ర వైడూర్యాలతో శోభిల్లుతున్న ‘సర్వాభరణాలంకృత రూపం’ కాగా.. రెండోది ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం స్వామివారి సహజ సిద్ధమైన దివ్య వర్చస్సును ఆవిష్కరించే ‘నిరాడంబర రూపం’. ఈ రెండు చిత్రాలను టీటీడీ అధికారికంగా ఆమోదించి ఫొటోలు, క్యాలెండర్లుగా ముద్రించింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఇళ్లలో, ఫోన్లలో దర్శనమిస్తున్న శ్రీవారి రూపం వెనుక శ్రీనివాసన్ కఠోర సాధన, భక్తి భావమే ఉన్నాయి. వేంకటేశ్వరస్వామితో పాటు పలు ఇతర దేవతామూర్తుల చిత్రాలను కూడా ఆయన అత్యంత జీవకళ ఉట్టిపడేలా గీశారు. ఆయన మృతి పట్ల ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు, భక్తులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
