Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో, అటు గల్లా ఫ్యామిలీలో ఇప్పుడు ఫుల్ పెళ్లి వైబ్స్ కనిపిస్తున్నాయి! మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ – పద్మావతి దంపతుల కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే.. సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోయేది సౌత్ కొరియాకు చెందిన హైయిన్ కిమ్ (Hyein Kim) అనే అమ్మాయిని! వీరిద్దరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇటీవల అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. ప్రస్తుతం మహేశ్ బాబు తన భారీ పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) షూటింగ్లో బిజీగా ఉండటంతో ఈ వేడుకకు రాలేకపోయినా.. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ మాత్రం ఫ్యామిలీ మొత్తం తరఫున ముందుండి సందడి చేశారు!
కాలేజ్ లవ్ స్టోరీ నుంచి పెళ్లి పీటల దాకా..
సిద్ధార్థ్ గల్లా, హైయిన్ కిమ్లది క్యూట్ కాలేజ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది..వీరిద్దరూ కాలేజ్ రోజుల నుంచే ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే వీరి నిశ్చితార్థం (Engagement) జరగగా, తాజాగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
పక్కా ట్రెడిషనల్ లుక్‌లో కొరియన్ కోడలు – వైరల్ అవుతున్న ఫొటోలు!
నమ్రత శిరోద్కర్ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “Getting married… Always fun with family!” అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికొడుకు సిద్ధార్థ్ లైట్ కలర్ కుర్తా సెట్లో సింపుల్ అండ్ క్లాసీగా కనిపించగా.. పెళ్లికూతురు హైయిన్ కిమ్ మాత్రం ఆరెంజ్ కలర్ ట్రెడిషనల్ లెహంగా (ఘాగ్రా), నిండుగా సంప్రదాయ ఆభరణాలు, నుదుటన బొట్టుతో అచ్చం తెలుగు ఆడపడుచులా మెరిసిపోయింది. ఈ వేడుకలో నమ్రతతో పాటు సిద్ధార్థ్ తల్లి గల్లా పద్మావతి, మంజుల ఘట్టమనేని మరియు ఇతర కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
‘వారణాసి’ షూటింగ్లో బిజీగా సూపర్ స్టార్..
మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరుకాలేకపోయారు. అయితే అసలు పెళ్లి వేడుకకు మాత్రం సూపర్ స్టార్ తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా హాజరుకానున్నారు. ఏదేమైనా, ఈ ఇండో-కొరియన్ వెడ్డింగ్‌తో అటు ఘట్టమనేని, ఇటు గల్లా కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది!
