Chandrababu: పెట్టుబడుల సదస్సులంటే కేవలం కోట్ల రూపాయల కంపెనీల ఒప్పందాలు మాత్రమే కాదు.. పేదల జీవితాలను మార్చే మానవీయ కోణం కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు! విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) రెండో రోజున ఏపీ సీఆర్డీఏ, మారిటైమ్ బోర్డు, ఐటీ ఎలక్ట్రానిక్స్ సహా వివిధ రంగాల్లో 12 కీలక ఒప్పందాలు జరిగాయి.
ఒప్పందాలు జరిగిన వెంటనే అక్కడికక్కడే సంబంధిత జీవోలను (GOs) సంస్థల ప్రతినిధులకు అందజేసి చంద్రబాబు తన మార్క్ స్పీడ్ చూపించారు. అయితే, ఈ వేదికపై ఆయన ప్రస్తావించిన ‘P4’ (మార్గదర్శి – బంగారు కుటుంబం) కార్యక్రమం, దిగ్గజ కంపెనీలు హీరో మోటోకార్ప్, ఐటీసీలు పేదల కోసం ముందుకొచ్చిన తీరు సభలో అందరి మనసులను గెలుచుకుంది!
పేద విద్యార్థులు, కుటుంబాలకు కార్పొరేట్ దిగ్గజాల భరోసా..
స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో కలిసి రెండు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి..
-
1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు హీరో మోటోకార్ప్ స్కాలర్షిప్: పదో తరగతి పాసై, 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ (IIIT) చదువుతున్న 28 జిల్లాల్లోని 1,120 మంది పేద విద్యార్థులకు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అండగా నిలిచింది. ఒక్కో విద్యార్థికి రూ. 2.90 లక్షల చొప్పున మొత్తం రూ. 32.48 కోట్ల ఆర్థిక సాయం (బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్షిప్) అందించనుంది. ఆరేళ్ల తర్వాత వీరంతా చదువు పూర్తి చేసుకుంటే ఆ 1,120 కుటుంబాలు పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడతాయని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
-
100 గ్రామాలు – 25 వేల కుటుంబాలను దత్తత తీసుకున్న ఐటీసీ: ప్రముఖ సంస్థ ఐటీసీ (ITC Limited) రాష్ట్రంలోని 100 గ్రామాల్లో ఉన్న 25,000 ‘బంగారు కుటుంబాలను’ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఆయా కుటుంబాల జీవనోపాధి, ఆదాయం పెరిగేలా వారికి పూర్తిస్థాయి గైడెన్స్ ఇస్తూ అభివృద్ధి చేయనుంది.
అసలేంటి ఈ ‘P4’ మోడల్? ఇప్పటికే 11.37 లక్షల కుటుంబాలకు అండ!
ఇప్పటివరకు మనం ‘PPP’ (Public-Private Partnership) గురించి విన్నాం. దానికి ‘People’ (ప్రజలు) అనే మరో ‘P’ కలిపి చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త కాన్సెప్టే ‘P4’ (Public-Private-People Partnership). సమాజంలో ఆర్థికంగా టాప్ 10 శాతంలో ఉన్నవారు (‘మార్గదర్శకులు’), అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను (‘బంగారు కుటుంబాలు’) దత్తత తీసుకుని వారికి సరైన గైడెన్స్, ఉపాధి మార్గాలు చూపించడమే దీని ఉద్దేశం.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా మార్గదర్శకులు ముందుకొచ్చి ఏకంగా 11.37 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవడం విశేషం. కుప్పంలో టీవీఎస్ సంస్థ దత్తత తీసుకున్న ఓ ఇటుక బట్టీ మహిళా కూలీ రూ.1.50 లక్షల సాయంతో నేడు ఏడాదికి రూ.25 లక్షలు సంపాదించే ఓనర్‌గా ఎదిగిన తీరును, మరో యువకుడు ఈవీ ఆటోతో మొదలై నేడు మూడు వ్యాపారాలు నడుపుతున్న సక్సెస్ స్టోరీలను సీఎం సభలో పంచుకున్నారు.
ఐటీ శకం ముగిసింది.. ఇప్పుడు ఏఐ, స్పేస్ డేటా సెంటర్ల యుగం!
యువత, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
-
“నాకు కాగితాలపై సంతకాలు వద్దు.. ఇనాగరేషన్ డేట్ కావాలి!” ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీ రికార్డు వేగంతో ప్రాజెక్టును పూర్తి చేయాలని, భూమి, అనుమతుల బాధ్యత ప్రభుత్వానిదని, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారో డేట్ చెబితే చాలని అన్నారు.
-
డిస్రప్టివ్ థింకింగ్ (Disruptive Thinking): 30 ఏళ్ల క్రితం తాను ఐటీని ప్రమోట్ చేస్తే నేడు ప్రపంచంలోనే భారతీయులు అత్యధిక తలసరి ఆదాయం సంపాదిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఐటీ శకం ముగుస్తోందని.. ఏఐ (AI), క్వాంటం కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్స్, సెమీకండక్టర్లు, స్పేస్ డేటా సెంటర్ల యుగం మొదలైందని చెప్పారు. అంతరిక్షం నుంచే సౌరశక్తిని, రాత్రిపూట సూర్యరశ్మిని పంపే టెక్నాలజీపై కూడా మన యువత పనిచేస్తోందని తెలిపారు. అమరావతిలో సీఐఐతో కలిసి ‘గ్లోబల్ లీడర్షిప్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజలకు మంచి చేస్తే వారే ఆశీర్వదిస్తారు – ఓట్ షేర్‌పై సీఎం కామెంట్స్..
పెట్టుబడులు వస్తేనే సంపద సృష్టి జరుగుతుందని, ఆ సంపదతోనే పేదలను పైకి తీసుకురాగలమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓపీ జిందాల్ అధ్యయనం ప్రకారం తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో (Access to Equality) గోవా తర్వాత దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. “నా పాలసీల వల్లే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఓట్ షేర్ అదనంగా 3.6 శాతం పెరిగింది. ప్రజలకు మంచి చేస్తే వాళ్లే మనల్ని ఆశీర్వదిస్తారు” అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
