Mahesh Bhagwat

Mahesh Bhagwat: హైదరాబాద్ 63వ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ..

Mahesh Bhagwat: తెలంగాణలో ఇటీవల జరిగిన భారీ ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర 63వ పోలీస్ కమిషనర్‌గా (కోత్వాల్) సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సీనియర్ పోలీసు అధికారుల సమన్వయంతో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, నగర ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మరోవైపు, హైదరాబాద్ సీపీగా సేవలందించి తాజాగా తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీపై వెళ్తున్న వీసీ సజ్జనార్‌కు కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సజ్జనార్‌కు వివిధ జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కమిషనరేట్ కార్యాలయం ప్రధాన గేటు వరకు వచ్చి ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలకడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *