Elon Musk

Elon Musk: జెన్సన్ హువాంగ్‌కు జాబ్ ఇవ్వడానికి నేను సిద్ధం..!

Elon Musk: ప్రపంచ ఏఐ (AI) చిప్ మార్కెట్‌ను శాసిస్తున్న దిగ్గజ కంపెనీ ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇప్పుడు కెరీర్‌లోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు! ఒకవైపు చైనా గూఢచారి (Spy) ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో వివాహేతర సంబంధం, మరోవైపు సొంత కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌తో మరో ఎఫైర్ బయటపడటంతో.. ఆయన్ను సీఈఓ పదవి నుంచి పీకేసేందుకు ఎన్విడియా బోర్డు సిద్ధమవుతోంది. అయితే, ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఎన్విడియా ఆయన్ను బయటకు పంపితే.. తన కంపెనీలోకి తీసుకోవడానికి మస్క్ రెడ్ కార్పెట్ పరిచేశారు!

దయచేసి జెన్సన్‌ను మీ దగ్గర చేర్చుకోండి.. మస్క్ రిప్లై వైరల్!

ఎన్విడియా బోర్డు జెన్సన్ హువాంగ్‌ను తొలగించబోతోందన్న వార్తల నేపథ్యంలో ‘జీరోహెడ్జ్’ (Zerohedge) అనే ప్రముఖ ఫైనాన్షియల్ బ్లాగ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా “ఎలాన్, దయచేసి జెన్సన్‌ను హైర్ చేసుకోండి” అని పోస్ట్ పెట్టింది.

దీనిపై క్షణాల్లో స్పందించిన ఎలాన్ మస్క్.. “అది నాకు దక్కే గొప్ప గౌరవం (That would be an honor)” అంటూ రిప్లై ఇచ్చారు.

అంతకుముందు కూడా జెన్సన్ తన తప్పును ఒప్పుకుంటూ ఉద్యోగులకు మెమో పంపినప్పుడు.. “జెన్సన్ చాలా తెలివితక్కువ పని చేశాడు కానీ, ఆయనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఈ తరం అత్యుత్తమ పారిశ్రామికవేత్తల్లో ఆయన ఒకరు, అమెరికా ఏఐ నాయకత్వానికి ఆయన ఎంతో అవసరం” అంటూ వచ్చిన పోస్ట్‌కు మస్క్ “నేను ఏకీభవిస్తున్నాను” అని మద్దతు తెలిపారు.

మస్క్, జెన్సన్ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. 2016లో మస్క్ ఓపెన్‌ఏఐ (OpenAI)లో ఉన్నప్పుడు, ఎన్విడియా తయారు చేసిన మొట్టమొదటి ఏఐ సూపర్ కంప్యూటర్ (DGX-1)ను జెన్సన్ స్వయంగా మస్క్ ఆఫీసుకు వెళ్లి డెలివరీ చేశారు.

అసలు వివాదం ఏంటి? జెన్సన్ చుట్టూ రెండు ఎఫైర్ల ఉచ్చు:

లోరీ హువాంగ్‌ను వివాహం చేసుకున్న 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్.. ఇప్పుడు రెండు వివాహేతర సంబంధాల కారణంగా చిక్కుల్లో పడ్డారు:

  1. ఆలిస్ హువాంగ్ & చైనా గూఢచర్యం ఆరోపణలు: చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు బయటపడింది. ఆమెకు చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలతో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దీనిపై జెన్సన్ తన ఉద్యోగులకు పంపిన మెమోలో “నేను నా భార్యకు నమ్మకద్రోహం చేశాను. నా చర్యలు నా భార్య, పిల్లలను బాధించాయి. దీనికి ఎలాంటి సాకులు చెప్పలేను, క్షమించండి” అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. (అయితే గూఢచర్యం ఆరోపణలను చైనా కొట్టిపారేసింది).

  2. సొంత కంపెనీ వీపీ కింబర్లీ పావెల్‌తో రెండో ఎఫైర్: ఈ వివాదం చల్లారకముందే, ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్ (48) తో కూడా జెన్సన్‌కు సంబంధం ఉన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం ప్రచురించింది. గత మార్చిలో శాన్ జోస్‌లో జరిగిన ఎన్విడియా కాన్ఫరెన్స్ హోటల్‌లో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఒక వ్యక్తి వీడియో తీయగా, జెన్సన్ సెక్యూరిటీ టీమ్ ఆ వ్యక్తితో ‘నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్’ (NDA) చేయించి విషయం బయటకు రాకుండా ఆపినట్లు తెలిసింది.

ఎన్విడియా బోర్డు సీరియస్ యాక్షన్ – షేర్లు 8% పతనం!

కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగుల మధ్య వ్యక్తిగత సంబంధాలు వృత్తిపరమైన విరుద్ధ ప్రయోజనాలకు (Conflict of Interest) దారితీయకూడదు:

  • గతంలో ఇంటెల్ సీఈఓ బ్రియాన్ క్రజానిచ్, మెక్‌డొనాల్డ్స్ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బ్రూక్‌లు కూడా ఇలాంటి కారణాలతోనే పదవులు కోల్పోయారు.

  • 1993లో ఎన్విడియాను స్థాపించి, ఏఐ చిప్ మార్కెట్‌లో 90% వాటాతో కంపెనీని శిఖరాగ్రానికి చేర్చిన జెన్సన్ హువాంగ్‌ను ఇప్పుడు తొలగించేందుకు బోర్డు సమావేశమవుతున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. కొత్త సీఈఓ దొరికే వరకు తాత్కాలిక సీఈఓను నియమించే యోచనలో బోర్డు ఉంది. ఈ వార్తలతో ఎన్విడియా షేర్లు ఏకంగా 8 శాతం కుప్పకూలాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సపోర్ట్..

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా జెన్సన్ హువాంగ్‌ను వెనకేసుకొచ్చారు. “జెన్సన్ చాలా గౌరవనీయమైన వ్యక్తి, అమెరికా కోసం అద్భుతమైన పని చేశారు. ఆయన తప్పు చేశారని నేను అనుకోవడం లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆలిస్‌తో జెన్సన్ సంబంధం గురించి ట్రంప్‌కు దాదాపు ఏడాది క్రితమే తెలిసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *