Crime News: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఒక నిస్సహాయురాలిపై కూడా కనికరం లేకుండా ఓ 15 ఏళ్ల బాలుడు పైశాచికత్వానికి ఒడిగట్టిన ఘటన ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేరని గమనించి దొంగతనం చేయడానికి వెళ్లిన ఆ మైనర్.. ఒంటరిగా ఉన్న దివ్యాంగ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న నగదును కూడా దోచుకుని పరారయ్యాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.
తాళం వేసి పనికి వెళ్లిన కుటుంబం – అదను చూసి లోపలికి చొరబడిన బాలుడు:
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో కనీసం లేచి నడవలేని స్థితిలో ఉంది. మంగళవారం రోజున ఆ యువతి కుటుంబ సభ్యులు కూలి పని నిమిత్తం బయటకు వెళ్తూ.. ఆమెను ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లారు.
అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఆ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లో ఎవరూ లేరనుకుని దొంగతనం చేసే ఉద్దేశంతో తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు.లోపలికి వెళ్లాక కదలలేని స్థితిలో ఒంటరిగా ఉన్న దివ్యాంగ యువతిని చూసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లో దాచి ఉంచిన రూ. 4,000 నగదును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు.
కన్నీళ్లతో తల్లిదండ్రులకు చెప్పిన బాధితురాలు..
సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళం పగులగొట్టి ఉండటం చూసి షాక్ అయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బాధిత యువతి భయంతో వణికిపోతూ, కన్నీళ్లతో తనకు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో గుండె పగిలిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్ – జువైనల్ హోంకు తరలింపు..
ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన ములుగు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.గ్రామంలో విచారణ జరిపి, ఆధారాల ఆధారంగా బుధవారం నాడు ఆ 15 ఏళ్ల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. బోర్డు ఆదేశాల మేరకు బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
