Cancer Medicine Price: దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. క్యాన్సర్ చికిత్సలో వినియోగించే 137 రకాల కీలక ఔషధాలపై 30 శాతం గరిష్ఠ ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (TMR) పరిమితిని విధిస్తూ తీసుకున్న నిర్ణయం సోమవారం (నవంబర్ 9) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల వందలాది బ్రాండ్ల ఔషధాల గరిష్ఠ చిల్లర ధరలు (MRP) ఏకంగా 50 శాతం నుంచి గరిష్ఠంగా 96.45 శాతం వరకు భారీగా తగ్గాయి. తద్వారా దేశవ్యాప్తంగా బాధితులకు ఏటా సుమారు రూ.3,500 కోట్లకు పైగా ఆదా కానుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ట్రేడ్ మార్జిన్ క్యాపింగ్ – భారీగా తగ్గిన రేట్లు..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) ఈ ఆదేశాలను జారీ చేసింది.
-
76 ఫార్మా కంపెనీల కొత్త ధరలు: ఇప్పటివరకు 76 ఫార్మా సంస్థలు 121 మందులకు సంబంధించి మొత్తం 1,225 ఫార్ములేషన్లలో సవరించిన MRPలను సమర్పించాయి.
-
1,031 ఫార్ములేషన్ల ధరల్లో కోత: వీటిలో 1,031 ఫార్ములేషన్ల ధరలు గణనీయంగా తగ్గగా, 600కి పైగా ప్రముఖ బ్రాండ్ల ధరలు 50% కంటే ఎక్కువగా దిగివచ్చాయి.
-
భవిష్యత్ ఔషధాలకూ వర్తింపు: భారత్‌లో త్వరలో విడుదల కానున్న మరో 10 నుంచి 15 రకాల కొత్త క్యాన్సర్ మందులకు సైతం మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ ట్రేడ్ మార్జిన్ పరిమితులు వర్తిస్తాయి.
కీలకమైన క్యాన్సర్ మందుల పాత, కొత్త ధరల వివరాలు..
కొన్ని ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ధరల్లో వచ్చిన భారీ మార్పులు.
-
పాల్బోప్రో (Palbopro – Palbociclib 125 mg): రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ క్యాప్సూల్ ధర గతంలో రూ.40,421.33 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.2,720కి పడిపోయింది.
-
అబిరోన్ (Abirone – Abiraterone acetate 250 mg): ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణలో వాడే అర్విన్కేర్ ఫార్మా మాత్రల ధర రూ.41,250 నుంచి రూ.3,218.23కి తగ్గింది.
-
బ్రిక్స్టా (Bryxta – Bevacizumab 100 mg): ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార (Cervical) క్యాన్సర్‌కు ఇచ్చే జైడస్ లైఫ్‌సైన్సెస్ ఇంజెక్షన్ ధర రూ.25,995 నుంచి రూ.3,318కి దిగివచ్చింది.
-
డెనోస్టియోరెల్ (DenOsteoRel – Denosumab 60 mg): రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఇంజెక్షన్ ధర రూ.24,955 నుంచి రూ.6,240కి తగ్గింది.
-
లుపిహెర్ 2 (Lupiher 2 – Pertuzumab 420 mg): లుపిన్ లిమిటెడ్ రొమ్ము క్యాన్సర్ ఇంజెక్షన్ మునుపటి ధర రూ.83,520 కాగా, ఇప్పుడు రూ.37,358.30కి తగ్గించారు.
ఆసుపత్రులు, మెడికల్ షాపులకు స్పష్టమైన ఆదేశాలు..
సవరించిన రేట్ల ప్రకారం మాత్రమే మందులను విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది:
-
రిటైలర్లు, డీలర్లు, కార్పొరేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు తమ ప్రాంగణాల్లో, అధికారిక వెబ్సైట్లలో సవరించిన ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలి.
-
రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు (State Drug Controllers) క్షేత్రస్థాయిలో ఈ ధరల అమలును నిరంతరం పర్యవేక్షించనున్నారు.
‘ఫార్మా సహి దామ్’ యాప్‌లో ధరల సమాచారం – ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్..
రోగులు, ప్రజలు కొత్త ధరల వివరాలను తెలుసుకునేందుకు మరియు పాత రేట్లకు విక్రయిస్తే ఫిర్యాదు చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పించారు:
-
యాప్ లేదా పోర్టల్: కేంద్రం తీసుకొచ్చిన అధికారిక మొబైల్ అప్లికేషన్ ‘ఫార్మా సహి దామ్’ (Pharma Sahi Daam) లేదా ఎన్పీపీఏ (NPPA) అధికారిక వెబ్సైట్లో ఏ మందుకు ఎంత ధర తగ్గిందో సులభంగా తెలుసుకోవచ్చు.
-
టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్: తగ్గిన ధరల కంటే ఎక్కువ రేట్లకు విక్రయించినా, పాత MRPలతో అమ్మకాలు జరిపినా వెంటనే 1800-111-255 నంబర్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపులు, ఆసుపత్రులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
