Chandrababu: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) అఖండ విజయం సాధించింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో ప్రజలు కూటమి సుపరిపాలనకే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల కూటమి పాలన, సంక్షేమం మరియు రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పే ఇదని ఆయన స్పష్టం చేశారు. హింస, రౌడీయిజం, రక్తతర్పణాల రాజకీయాలకు ప్రజలు ఈ తీర్పుతో చరమగీతం పాడారని పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల కంటే మిన్నగా.. గణాంకాల్లో కూటమి హవా..
స్థానిక సమరంలో కూటమికి దక్కిన ఓటింగ్ శాతాన్ని, వైసీపీ పతనాన్ని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు.
-
ఓట్ల శాతంలో భారీ ఆధిక్యం: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 53.5 శాతం (మొత్తంగా 55.3%) ఓట్లు రాగా, తాజా స్థానిక ఎన్నికల్లో అది 58.90 శాతానికి పెరిగింది. మరోవైపు వైసీపీ ఓట్లు 39.81 శాతం నుంచి 33.56 శాతానికి పడిపోయాయి. కూటమి ఓట్ల శాతం పెరగ్గా, వైసీపీ దాదాపు 6.25 శాతానికి పైగా ఓట్లను కోల్పోయింది. కూటమి, వైసీపీ మధ్య ఏకంగా 25.35 శాతం ఓట్ల అంతరం నమోదైంది.
-
పట్టణాల్లో తిరుగులేని ఆధిపత్యం: పట్టణ స్థానిక సంస్థల్లో కూటమికి 59.9 శాతం, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయి.
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో రికార్డు: జడ్పీటీసీల్లో కూటమి 87.5 శాతం స్ట్రైక్ రేట్‌తో, 57.6 శాతం ఓట్లు సాధించింది (వైసీపీకి 39.7%). ఎంపీటీసీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.
-
28 జిల్లాల్లో 27 చోట్ల జయకేతనం: రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో ప్రజలు కూటమికే పట్టం కట్టారు. ఏకంగా 7 జిల్లాల్లో వైసీపీ కనీసం ఒక్క జడ్పీటీసీ కూడా గెలవలేక తుడిచిపెట్టుకుపోయింది.
మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ – డైరెక్ట్ ఎలక్షన్ల విజయం..
ఈ ఎన్నికల్లో తీసుకొచ్చిన ప్రత్యక్ష ఎన్నికల విధానం విజయవంతమైందని సీఎం తెలిపారు.
-
మేయర్, ఛైర్పర్సన్ స్థానాలు: మొత్తం స్థానాల్లో కూటమి 94 శాతం స్ట్రైక్‌రేట్ సాధించింది.
-
మేయర్ పీఠాలు: మొత్తం 13 కార్పొరేషన్లకు గాను 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు (విశాఖ మేయర్ స్థానాన్నీ కైవసం చేసుకున్నారు).
-
మున్సిపల్ ఛైర్పర్సన్లు: 87 మున్సిపాలిటీల్లో 82 చోట్ల కూటమి ఘనవిజయం సాధించింది.
-
పార్టీల వారీగా: టీడీపీ 70, జనసేన 20, బీజేపీ 4 చొప్పున మేయర్/ఛైర్పర్సన్ పదవులను దక్కించుకున్నాయి.
-
-
వార్డుల్లో క్లీన్‌స్వీప్: మొత్తం 3,941 వార్డుల్లో కూటమి ఏకంగా 3,233 వార్డులను (82%) గెలుచుకుంది. వైసీపీ కేవలం 558 (14.2%) వార్డులకే పరిమితమైంది. ఏకంగా 22 పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ బోణీ కూడా కొట్టలేకపోయింది.
అభివృద్ధికి ఆమోదం – సంక్షేమ పాలనకు గౌరవం..
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన ఫలితమే ఈ అఖండ విజయమని సీఎం అన్నారు.
-
సూపర్ సిక్స్ & పెన్షన్లు: ఇచ్చిన మాట ప్రకారం సమయానికి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని, ఎక్కడా లేని విధంగా పింఛన్లను రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచి అందిస్తున్నామని గుర్తుచేశారు.
-
భూ పట్టాలు & పరిశ్రమలు: 60 వేల మంది నిరుపేదలకు రూ.50 వేల కోట్ల విలువైన భూమి పట్టాలు ఇచ్చామని, భారీగా పెట్టుబడులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామని వివరించారు.
-
రాయలసీమ రతనాల సీమగా మార్పు: రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, బనకచర్ల మీదుగా గోదావరి–కావేరి అనుసంధానానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నీళ్లిస్తే సీమ రైతులు బంగారం పండిస్తారన్నారు. వెలిగొండ ఫేజ్-1 పూర్తి చేసి మార్కాపురం జిల్లా ఇచ్చామని, ఫలితంగా అక్కడి ప్రజలు 21 జడ్పీటీసీలను క్లీన్‌స్వీప్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారన్నారు.
-
ఉత్తరాంధ్ర & పోలవరం: ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చి, పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు.
-
యాక్సిస్ ఈక్వాలిటీ ఇండెక్స్: ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ నివేదిక ప్రకారం ‘యాక్సిస్ ఈక్వాలిటీ ఇండెక్స్-2026’లో ఏపీ దేశంలోనే రెండో ర్యాంకు సాధించిందని తెలిపారు.
వైసీపీ ‘రప్పారప్పా’ సంస్కృతిపై నిప్పులు చెరిగిన బాబు..
వైసీపీ అనుసరించిన హింసాత్మక విధానాలను చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.
-
“రౌడీయిజం, నేరాలు చేయడమే రాజకీయం అనుకోవడానికి ఇది రాతియుగం కాదు.. క్వాంటం యుగం. ప్రజలు రక్తతర్పణాలు, రప్పారప్పా సంస్కృతిని పూర్తిగా తిరస్కరించారు.”
-
ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని, ఉగ్రవాదుల తరహాలో ‘హిట్ అండ్ రన్’ రాజకీయాలు చేసి పారిపోయారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
-
తుఫాన్ల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలు పట్టించుకోని వారికి ఓట్లు అడిగే హక్కే లేదన్నారు.
రూ.500 నోట్ల రద్దు డిమాండ్ – ఓటమిపై అంతర్మథనం..
-
పెద్ద నోట్ల రద్దు: దేశంలో అవినీతి, బ్లాక్ మనీని సమూలంగా నిర్మూలించడానికి రూ.500 నోట్లను రద్దు చేయాలని, కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే చలామణిలో ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాల్సిందిగా ప్రధాని మోదీని కోరతానని చెప్పారు.
-
ఓటమి చెందిన చోట్ల సమీక్ష: అనంతపురం వంటి చోట్ల ఓడిపోవడం, ఎంతో అభివృద్ధి చేసినా ఏజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపారు. అక్కడ ఓటర్లు ఏ ప్రలోభాలకు లోనయ్యారు, మత మార్పిడుల ప్రభావం ఏమైనా ఉందా అనే అంశాలను సమగ్రంగా విశ్లేషిస్తామన్నారు.
-
రెబల్స్‌కు నో ఎంట్రీ: కూటమి ధర్మాన్ని ఉల్లంఘించి పోటీ చేసిన రెబల్స్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
