Gachibowli Suicide

Gachibowli Suicide: ఒకే కుటుంబంలో ముగ్గురి అనుమానాస్పద మృతి..!

Gachibowli Suicide: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఉన్న జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. మృతుల్లో మాజీ బ్యాంక్ మేనేజర్, ఆయన భార్య మరియు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వారి కుమారుడు ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు, ఐటీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ఉదయం 8:40 గంటలకు వెలుగులోకి..

పోలీసులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్ (పాలమూరు) జిల్లా అచ్చంపేట మండలం తల్లాచెరువు గ్రామానికి చెందిన బత్తుల మారెడ్డి (మర్రెడ్డి – 65), ఆయన భార్య భారతి (60), వారి కుమారుడు నిశాంత్‌రెడ్డి (38)గా గుర్తించారు.

 

మారెడ్డి గతంలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అవ్వగా, ఆయన కుమారుడు నిశాంత్‌రెడ్డి ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరు గత ఏడాది కాలంగా గౌలిదొడ్డిలోని ‘జయభేరి నిర్వాణ’ అపార్ట్‌మెంట్స్‌లోని సి-బ్లాక్, 7వ అంతస్తు ఫ్లాట్ నంబర్ 702లో నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో ఫ్లాట్‌లో ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలే కారణమా?
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించాయి. నిశాంత్‌రెడ్డికి వివాహమై ఒక కుమారుడు ఉన్నాడని, అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గత కొంతకాలంగా వారు విడివిడిగా ఉంటున్నట్లు తెలిసింది.

 

దీంతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోగ్య సమస్యలతో, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్నట్లు ప్రాథమిక విచారణలో సమాచారం అందింది. ఈ సమస్యల కారణంగానే ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి సీఐ కె. సైదులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఫ్లాట్‌లోని కీలక నమూనాలను సేకరించారు.

 

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడానికి గల అసలు కారణాలు, పరిస్థితులపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారి స్వగ్రామమైన తల్లాచెరువుతో పాటు అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *