Crime News: పశ్చిమ బెంగాల్‌లో అత్యంత పైశాచిక, భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో క్షణికావేశానికి లోనైన ఓ భర్త.. కట్టుకున్న భార్యను ఇంట్లోనే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా ఆమె తెగిన తలను చేతిలో పట్టుకుని నేరుగా స్థానిక కాళీమాత ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. ఈ రక్తసిక్త దృశ్యాన్ని చూసిన స్థానికులు, భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతుకం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్‌కు చెందిన 46 ఏళ్ల రింటూ ఘోష్‌కు సుమారు 15 ఏళ్ల క్రితం సీమా సర్కార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మైనర్ కుమారులు ఉన్నారు. గతంలో బస్సు కండక్టర్‌గా పనిచేసిన రింటూ, కొంతకాలం క్రితం ఉద్యోగం కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆదాయ మార్గం లేకపోవడంతో నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇంట్లో మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చెలరేగడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన రింటూ పదునైన ఆయుధంతో భార్యపై విరుచుకుపడి ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి నరికేశాడు. ఈ దారుణం జరుగుతున్న సమయంలో వారిద్దరి మైనర్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
హత్య అనంతరం నిందితుడు రక్తమోడుతున్న భార్య తెగిన తలను పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని కాళీమాత ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాడు. తలను పక్కన పెట్టుకుని అతడు చేసిన వింత చేష్టలు, హంగామాను చూసిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే గంగారాంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంట్లోని మొండేన్ని, తలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలి నుంచి ఆధారాలు సేకరించగా, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
