Delhi Pollution 

Delhi Pollution: ఢిల్లీలో విషపూరితమైన గాలి.. ‘గ్రాప్-3’ ఆంక్షలు అమలు.. రోజుకు 30 సిగరెట్లు తాగినట్లే! సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (NCR) పరిధిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్కును దాటి ‘తీవ్రమైన’ (Severe) కేటగిరీలోకి పడిపోవడంతో.. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) తక్షణమే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (GRAP) మూడో దశ (Stage III) ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. మరోవైపు ఈ కాలుష్య సంక్షోభంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేవలం కోర్టు ఆదేశాలు, ఆంక్షలతోనే కాలుష్యం తగ్గదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని స్పష్టం చేసింది.

అసలేమిటీ ‘గ్రాప్’ (GRAP)?

కాలుష్య స్థాయిని బట్టి నాలుగు దశల్లో అమలు చేసే అత్యవసర ప్రణాళికే GRAP (Graded Response Action Plan).

స్టేజ్-1 (Poor): గాలి నాణ్యత సూచీ (AQI) 201-300 మధ్య ఉంటే అమలు చేస్తారు.

స్టేజ్-2 (Very Poor): AQI 301-400 మధ్య ఉన్నప్పుడు విధిస్తారు.

స్టేజ్-3 (Severe): AQI 401-450 మధ్య ఉన్నప్పుడు అత్యంత కఠిన ఆంక్షలు అమలవుతాయి.

స్టేజ్-4 (Severe+): AQI 450 కంటే ఎక్కువకు చేరితే అత్యవసర పరిస్థితి విధిస్తారు.

గ్రాప్-3 కింద వేటిపై నిషేధం?

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో స్టేజ్-3 అమల్లోకి రావడంతో కింది కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయి:

నిర్మాణ, కూల్చివేత పనులు (C&D): డస్ట్ ఎక్కువగా వెలువడే తవ్వకాలు, డ్రిల్లింగ్, పైలింగ్, డ్రైనేజీ/పైప్‌లైన్ కోసం ఓపెన్ ట్రెంచ్ తవ్వకాలు, ప్లాస్టరింగ్, పెయింటింగ్, టైల్స్ కటింగ్, ఆర్ఎంసీ (RMC) ప్లాంట్లు, వెల్డింగ్ మరియు రోడ్డు నిర్మాణ పనులపై పూర్తి నిషేధం.

పరిశ్రమలు & మైనింగ్: స్టోన్ క్రషర్లు, మైనింగ్ అనుబంధ కార్యకలాపాలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలి.

వాహనాలపై ఆంక్షలు

ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో BS-III పెట్రోల్, BS-IV డీజిల్ లైట్ మోటార్ వాహనాల (LMV) రాకపోకలపై నిషేధం.

ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన BS-IV డీజిల్ మధ్యతరహా, తేలికపాటి గూడ్స్ వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం లేదు.

ఇంధన వినియోగం: చలి కాచుకోవడానికి లేదా ఇతర అవసరాలకు బొగ్గు, కట్టెల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

వేటికి మినహాయింపు ఉంది?

రైల్వేలు, మెట్రో సేవలు, ఎయిర్‌పోర్టులు, బస్ టెర్మినల్స్, డిఫెన్స్, జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులు, ఆసుపత్రులు, హైవేలు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్, తాగునీరు, శానిటేషన్ పనులను కఠినమైన డస్ట్ కంట్రోల్ నిబంధనలతో కొనసాగించవచ్చు.
పాఠశాలలు & ఆఫీసులు: 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలను హైబ్రిడ్ మోడ్ (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)లో నిర్వహించాలని ప్రభుత్వాలను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రోజుకు 30 సిగరెట్లు తాగినట్లే.. సుప్రీంకోర్టులో వాదనలు..

కాలుష్య పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది:

అమికస్ క్యూరీ వ్యాఖ్యలు: రాజధానిలో గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని కోర్టుకు సహకరిస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన కాలుష్యం వల్ల తన గొంతు కూడా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఢిల్లీ కాలుష్యంలో పంట వ్యర్థాల దహనం (స్టబుల్ బర్నింగ్) వాటా 14 శాతమేనని, వాహన ఉద్గారాలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
ఎలైట్ కార్లపై సుప్రీం ప్రశ్న: “మనం ఎప్పుడూ రైతుల స్టబుల్ బర్నింగ్ గురించే మాట్లాడతాం. మరి ధనిక వర్గాల సంగతేంటి? రోడ్లపై బారులుతీరే విలాసవంతమైన ప్రైవేట్ వాహనాల పరిస్థితి ఏంటి?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆంక్షలతో పరిష్కారం దొరకదు: “మేము ఎన్ని ఆదేశాలు ఇస్తే, అన్ని ఉల్లంఘనలు జరుగుతాయి. కేవలం ఆంక్షలతో సమస్య తీరదు. పండుగలను బాధ్యతాయుతంగా, పర్యావరణహితమైన సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవాలి. పేద ప్రజలు కాలుష్యాన్ని సృష్టించరు.. వారే దీనికి బాధితులు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

కేంద్రం సమాధానం..

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ.. ఢిల్లీ భౌగోళిక పరిస్థితుల వల్ల శీతాకాలంలో గాలి వీయక కాలుష్యం పేరుకుపోతోందని తెలిపారు. ఢిల్లీలోకి కేవలం BS-6 వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని, జియో-ట్యాగ్డ్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేనిదే పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వడం లేదని, డీజిల్ ఆటోలను దశలవారీగా తొలగిస్తున్నామని కోర్టుకు వివరించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రజలు సైకిళ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *