Cyber Fraud

Cyber Fraud: ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ! ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలివే!

Cyber Fraud: దీపావళి పండుగ వేళ కొత్త స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇంట్లోకి కావలిసిన వస్తువులు కొనేందుకు వినియోగదారులు ఆన్‌లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల సేల్స్‌తో పాటు నకిలీ ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు కూడా అమాయకులను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ వెబ్‌సైట్ లింకులు, బహుమతుల పేరిట వల విసురుతూ ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి.
భారీ డిస్కౌంట్లు కనిపిస్తే జాగ్రత్త!
మార్కెట్ ధర కంటే 70% నుంచి 80% వరకు తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఇస్తామంటూ వచ్చే ప్రకటనలను వెంటనే నమ్మకండి. వెంటనే ఏదైనా సైట్‌లో విపరీతమైన ఆఫర్ కనిపిస్తే, సదరు బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ లేదా పేరున్న యాప్‌లలో అదే వస్తువు ధర ఎంత ఉందో చెక్ చేయండి.” కొన్నిసార్లు కేవలం 2 గంటలే ఆఫర్, “చివరి 3 వస్తువులే మిగిలాయి” అంటూ ఒత్తిడి చేసే యాడ్స్ లేదా మెసేజ్ లా వెనుక మోసం దాగి ఉండే అవకాశం ఎక్కువ.
నకిలీ లింకులు, నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తత..
వాట్సాప్ గిఫ్ట్ మెసేజ్‌లు: దీపావళి లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్ వచ్చిందని, ఉచితంగా ఫోన్ గెలుచుకున్నారని వచ్చే లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయకండి.

 

యూఆర్‌ఎల్ (URL) పరిశీలన: ప్రముఖ వెబ్‌సైట్ల పేర్లను పోలి ఉండే నకిలీ డొమైన్లు సృష్టిస్తారు (ఉదాహరణకు amazon బదులు amaz0n లేదా flipkart బదులు fl1pkart). స్పెల్లింగ్, ‘https://’ సెక్యూర్ కనెక్షన్ ఉందో లేదో చూడండి.

ఏపీకే (APK) ఫైల్స్ వద్దు: ప్రత్యేక డిస్కౌంట్ యాప్ పేరిట వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయకూడదు. యాప్‌లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

సైట్‌లో కస్టమర్ కేర్ నంబర్, రిటర్న్ పాలసీ, యూజర్ రివ్యూలు ఉన్నాయో లేదో చూశాకే కొనుగోలు చేయాలి.
డెలివరీ మోసాలు & బ్యాంకింగ్ భద్రత..
  • పార్సిల్ ఆగిపోయిందంటూ మెసేజ్: “మీ దీపావళి ఆర్డర్ అడ్రస్ తప్పుగా ఉంది, వెంటనే ₹5 లేదా ₹10 చెల్లించి అప్‌డేట్ చేయండి” అంటూ వచ్చే ఎస్సెమ్మెస్‌లు, లింకులను నమ్మవద్దు. మీ ఆర్డర్ స్థితిని నేరుగా మీ షాపింగ్ యాప్‌లోనే చెక్ చేయండి.
  • ఓటీపీ, యూపీఐ పిన్ గోప్యత: బ్యాంక్ లేదా డెలివరీ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి OTP, UPI PIN, కార్డ్ CVV లేదా పాస్‌వర్డ్ అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. గుర్తుంచుకోండి.. డబ్బులు ఖాతాలో పడటానికి ఎప్పుడూ UPI PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
  • స్క్రీన్ షేరింగ్ యాప్స్: కస్టమర్ సపోర్ట్ పేరిట AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని చెబితే తిరస్కరించండి.
  • మీ ఇ-కామర్స్ ఖాతాలు, బ్యాంకింగ్ యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టి, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్‌లో ఉంచుకోండి.

ఒకవేళ మోసపోతే వెంటనే ఏం చేయాలి?

పొరపాటున లింక్ క్లిక్ చేసినా లేదా మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినా ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఈ చర్యలు తీసుకోండి.
  1. బ్యాంక్‌కు సమాచారం: వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి జరిగిన లావాదేవీని రిపోర్ట్ చేయండి. మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ను బ్లాక్ చేయించండి.
  2. హెల్ప్‌లైన్ నంబర్ 1930: దేశవ్యాప్త సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి తక్షణమే ఫిర్యాదు నమోదు చేయండి. నేరం జరిగిన మొదటి ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే బ్యాంక్ నుంచి సదరు నగదు బదిలీని నిలిపివేసే అవకాశం ఉంటుంది.
  3. ఆన్‌లైన్ ఫిర్యాదు: కేంద్ర ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో లావాదేవీ వివరాలు, ట్రాన్సాక్షన్ ఐడీ, మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లతో ఫిర్యాదు చేయండి.
  4. పాస్‌వర్డ్‌ల మార్పు: అనుమానాస్పదంగా అనిపించిన వెంటనే మీ ఈమెయిల్, యూపీఐ, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను మార్చి, మొబైల్‌లోని తెలియని యాప్‌లను డిలీట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *