Graduate MLC: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో గ్రాడ్యుయేట్లకు భారీ ఊరట లభించింది. ఫారమ్-18 ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రాథమిక గడువుతో సంబంధం లేకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసే చివరి రోజు వరకు అర్హులైన గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆన్లైన్ పోర్టల్లో సర్వర్ సమస్యల కారణంగా వేలాది మంది దరఖాస్తు సమర్పించలేకపోయారన్న ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సర్వర్లు మొరాయించడంతో నిర్ణయం.. పోర్టల్ పునరుద్ధరణ!
గత రెండు మూడు రోజులుగా సీఈవో అధికారిక వెబ్సైట్, ఓటరు నమోదు పోర్టల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో సర్వర్లు తీవ్రంగా మొరాయించాయి. సర్వర్లు డౌన్ కావడంతో నిర్దేశిత గడువు సమీపిస్తున్న వేళ దరఖాస్తులు సమర్పించలేక గ్రాడ్యుయేట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎన్నికల యంత్రాంగం వెంటనే స్పందించింది. సాంకేతిక సమస్యలను ఐటీ నిపుణుల సాయంతో యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని, పోర్టల్ వేగాన్ని పెంచి సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఓటరు జాబితా షెడ్యూల్ వివరాలు..
ఎన్నికల సంఘం ప్రకటించిన కార్యచరణ ప్రకారం ముఖ్యమైన తేదీలు..
నవంబర్ 25: పట్టభద్రుల ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితా అధికారిక ప్రచురణ.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిములు, ఫిర్యాదుల స్వీకరణ.
అభ్యంతరాల పరిష్కారం తర్వాత తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అయితే, నామినేషన్ల ఆఖరి తేదీ వరకు కూడా నిరంతర ఓటరు నమోదు కింద అర్హులు ఫారమ్-18 సమర్పించవచ్చని సీఈవో భరోసా ఇచ్చారు.
రెండు కీలక నియోజకవర్గాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు!
రాష్ట్రంలోని రెండు ప్రధాన పట్టభద్రుల స్థానాల్లో కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన వేగంగా సాగుతోంది.
-
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం
-
వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం
ఈ నియోజకవర్గాల పరిధిలో అర్హత కలిగిన డిగ్రీ పట్టభద్రులంతా(గ్రాడ్యుయేట్) సరైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయనుంది. గడువు నామినేషన్ల దాఖలు వరకు ఉండటంతో ఇంకా దరఖాస్తు చేసుకోని పట్టభద్రులు ఊపిరి పీల్చుకున్నారు.
