nara lokesh

Nara Lokesh: రాష్ట్రమంతా ప్రశాంతం.. పులివెందులలోనే ఎందుకు రచ్చ?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పులివెందులలో నెలకొన్న ఉద్రిక్తతలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతుంటే, ఒక్క పులివెందులలోనే గొడవలు ఎందుకు చెలరేగుతున్నాయో ప్రజలు గమనించాలని ఆయన ప్రశ్నించారు. పులివెందులలో శాంతిభద్రతల సమస్యను సృష్టించిందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని లోకేశ్ ఘాటుగా ఆరోపించారు.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులలో ఇతర పార్టీల వారిని కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా బెదిరించి, ప్రతి వార్డునూ బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్యం వచ్చిందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోటీ చేసేలా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి చరిత్ర కలిగిన వైఎస్ జగన్, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
పులివెందులలో పోలింగ్ రోజున ఉద్రిక్తతలు రాజేసి గొడవలకు కారణమైంది జగన్, ఆయన పార్టీ వర్గాలేనని లోకేశ్ మండిపడ్డారు. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు బరితెగించి టీడీపీ నేతలకు చెందిన వాహనాలను సైతం తగలబెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసను ప్రేరేపించి ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని చూసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *