nara lokesh

Nara Lokesh: ‘రాబోయే 48 గంటలు అత్యంత కీలకం’.. ఆ కుటుంబానికి అండగా ఉంటాం

Nara Lokesh: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో స్వయంగా పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లతో బాలికను బెంగళూరుకు తరలించగా, అక్కడికి చేరుకున్న మంత్రి లోకేష్ వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాబోయే 48 గంటలు చాలా కీలకం.. మంత్రి లోకేష్

ఆసుపత్రిలో బాధితురాలిని పరిశీలించిన అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు.. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 48 గంటల సమయం ఆమె ఆరోగ్యానికి ఎంతో కీలకమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్య బృందం బాలిక ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా శ్రమిస్తోంది.
ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా కూడా ఆ కుటుంబ బాధ్యతను నేనే తీసుకుంటాను” అని లోకేష్ స్పష్టం చేశారు.
విద్యార్థులు, టీచర్లకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్
పాఠశాల తరగతి గదిలోనే ఇంతటి పాశవిక దాడి జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
తోటి విద్యార్థుల కళ్లెదుటే రక్తపాతం జరగడంతో పిల్లలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వారి మనస్సుల్లోంచి ఆ భయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులందరికీ మానసిక నిపుణులతో (Psychologists) ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పాఠశాల ఉపాధ్యాయులకు కూడా కౌన్సిలింగ్ అందిస్తున్నామని తెలిపారు.
పాఠశాలల్లో భద్రతపై మరింత దృష్టి
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విద్యాసంస్థల్లో భద్రతా లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *