Saurav Das

Saurav Das: సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై అనుమానాలు

Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్ పౌరసత్వం, అసలు గుర్తింపుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అసలు భారత పౌరుడేనా అన్న అంశంపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)తో విచారణ జరిపించాలని, ఒకవేళ ఆయన భారతీయుడు కాదని తేలితే ఆయనకు జారీ చేసిన పాస్‌పోర్ట్, ఇతర అధికారిక గుర్తింపు పత్రాలను రద్దు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ఫస్ట్ డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వంతో పాటు సౌరవ్ దాస్‌కు కూడా అధికారిక నోటీసులు జారీ చేసింది.
అసలు పేరు ‘యోగేష్ శర్మ’.. మూలాలు నేపాల్‌లోనే?
చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆర్. గణేష్ కుమార్ తరఫున న్యాయవాది బి. జగన్నాథ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు సంచలన ఆరోపణలు చేశారు. సౌరవ్ దాస్ అసలు పేరు “యోగేష్ శర్మ” అని, ఆయన కుటుంబ మూలాలు నేపాల్‌కు చెందినవని పిటిషనర్ ఆరోపించారు.
ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి, తప్పుడు పత్రాలతో భారతదేశంలో గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ పొందారని పేర్కొన్నారు. ఆయన వద్ద ఎన్ని దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయో ఎవరికీ తెలియదని, దేశ భద్రత దృష్ట్యా దీనిపై లోతైన దర్యాప్తు జరగాలని అఫిడవిట్‌లో విన్నవించారు.

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు.. ఖాతాల బ్లాక్‌కు విజ్ఞప్తి

సౌరవ్ దాస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా పిటిషనర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరుస్తూ వరుసగా పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనకు చెందిన ‘X’ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని కోర్టును కోరారు.

 

దేశంలో గందరగోళం, అరాచకం సృష్టించేందుకే ఆయన సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని, విదేశాల నుంచి ఆయనకు నిధులు అందుతున్నాయని ఆరోపించారు. గతంలో జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్కరణల పేరిట జరిగిన ఆందోళనలో “పార్లమెంట్‌ను ముట్టడించాలి” అంటూ యువతను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విచారణకు హైకోర్టు ఆదేశం
ఈ పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, ప్రతివాది సౌరవ్ దాస్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించింది. సౌరవ్ దాస్ నేపథ్యం, పౌరసత్వ వివరాలు, వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఏ విధంగా ఉండబోతోందనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *