Supreme Court: ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్‌లో “మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం.. మీ ఖాతాలోని డబ్బులను వెరిఫికేషన్ కోసం ఆర్బీఐకి పంపాలి” అంటూ సైబర్ ముఠాలు సాగిస్తున్న దోపిడీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకుల పర్యవేక్షణా లోపం, డ్యూ డిలిజెన్స్ (ముందస్తు తనిఖీలు) పాటించకపోవడం వల్లే సామాన్యుల జీవితకాల సంపాదన నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోందని స్పష్టం చేసింది.
ఖాతాదారుల నగదును కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ఆర్థిక సంస్థలదేనని తేల్చిచెప్పిన ధర్మాసనం.. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల బాధితులు మోసపోతే, పోగొట్టుకున్న పూర్తి మొత్తాన్ని సంబంధిత బ్యాంకులే పరిహారంగా చెల్లించాలని, బాధ్యులైన అధికారులపై ప్రాసిక్యూషన్ చర్యలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది.
రోజూ రూ.10 వేలు తీసేవాడు రూ.50 వేలు డ్రా చేస్తే గుర్తించరా?.. CJI ఆగ్రహం
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సుమోటో పిల్ (PIL)పై కీలక వ్యాఖ్యలు చేసింది.
-
అసాధారణ లావాదేవీలను ఆపాల్సిందే: “సాధారణంగా రోజూ రూ.10,000 లేదా రూ.20,000 డ్రా చేసే ఒక ఖాతాదారుడు అకస్మాత్తుగా రూ.50,000 లేదా అంతకంటే పెద్దమొత్తంలో వేరే అనుమానాస్పద ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే బ్యాంకులు ఎందుకు అలర్ట్ కావడం లేదు? పెద్ద కంపెనీల ట్రాన్సాక్షన్లను పక్కనపెడితే.. సాధారణ పౌరుల అసాధారణ లావాదేవీలను ఫ్లాగ్ చేసి తాత్కాలికంగా నిలిపివేయాల్సిన కనీస బాధ్యత లేదా? అని సీజేఐ ప్రశ్నించారు.
-
కఠిన బాధ్యత (Strict Liability): బ్యాంకులు తమ డ్యూ డిలిజెన్స్ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, బాధితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు సదరు సంస్థలు, అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చదువుకున్నవారే ఎందుకు మోసపోతున్నారు?
డిజిటల్ అరెస్ట్ మోసాల్లో ఉన్నత విద్యావంతులే ఎక్కువగా చిక్కుకోవడంపై ధర్మాసనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఫోన్లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మిమ్మల్ని అరెస్ట్ చేశామని చెప్పగానే అరెస్ట్ అయిపోయామని ఎలా నమ్ముతారు? అసలు ఈ ‘ఫియర్ సైకోసిస్’ (భయభ్రాంతులకు గురికావడం) ఏంటి? చట్టబద్ధమైన దేశంలో ఉంటూ డిజిటల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి బందీలుగా ఉండి డబ్బులు ఎలా బదిలీ చేస్తారు? ఈ తరహా అవగాహనారాహిత్యంతో భావితరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు?” అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.
హర్యానాలో సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో సుప్రీంకోర్టు ఫేక్ ఉత్తర్వులను చూపి ఒక వృద్ధ దంపతుల నుంచి ఏకంగా రూ.1.05 కోట్లకు పైగా కాజేసిన ఘటనను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.
ఆర్బీఐకి గడువులు.. నవంబర్ 30 నాటికి నోటిఫికేషన్!
దేశ ఆర్థిక వ్యవస్థపై సైబర్ నేరాల కారణంగా ఒక్క ఈ ఏడాదిలోనే ఏకంగా రూ. 800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకుల ద్వారా బాధితులకు పరిహారం అందించే సరికొత్త నిబంధనలను (KYC అండ్ డ్యూ డిలిజెన్స్ అమెండ్మెంట్ డైరెక్షన్స్, 2026) నవంబర్ 30, 2026 నాటికి నోటిఫై చేయాలి. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను డిసెంబర్ 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలి. దేశంలోని అన్ని అధీకృత ఆర్థిక సంస్థల జాబితాను తదుపరి విచారణ నాటికి కోర్టుకు సమర్పించాలని ఆర్బీఐని ఆదేశించింది.
‘మ్యూల్ ఖాతాల’పై ఉక్కుపాదం.. ఏఐ టెక్నాలజీతో చెక్!
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు జోక్యం, పౌరుల్లో అవగాహన వల్ల గత ఏడాదితో పోలిస్తే డిజిటల్ అరెస్ట్ కేసులు 50 శాతం తగ్గాయని తెలిపారు.
నకిలీ పోలీస్, ఏజెన్సీల సందేశాలను గుర్తించే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, ఇప్పటికే సుమారు 9,400 అనుమానాస్పద వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేశామని పేర్కొన్నారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) సేవలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
అయితే, సైబర్ నేరగాళ్లు అమాయకుల పేరుతో సృష్టించే “మ్యూల్ ఖాతాలను” (Mule Accounts/డమ్మీ బ్యాంక్ అకౌంట్లను) గుర్తించి వెంటనే స్తంభింపజేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడాలని, బ్యాంకుల్లో నేరగాళ్లకు సహకరించే అంతర్గత సిబ్బందిపై తీసుకున్న చర్యల వివరాలను తదుపరి విచారణలో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
