Supreme Court

Supreme Court: సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికే దక్కిన 550 ఎకరాల విలువైన స్థలం!

Supreme Court: హైదరాబాద్ శివారులో వేల కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ వర్సెస్ సర్కార్ భూపోరుకు ఎట్టకేలకు తెరపడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని సుమారు 550 ఎకరాల భూవివాదంపై సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దాదాపు 23 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 20 ప్రత్యేక లీవ్ పిటిషన్లను (SLPs) కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఈ విలువైన భూములు ప్రభుత్వానివేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో పాటు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిన అధికారుల తీరును ప్రశంసించింది.
550 ఎకరాలు.. 23 ఏళ్ల న్యాయపోరాటం!

భూమి విస్తీర్ణం: మియాపూర్ సర్వే నెం.100 లో 277.05 ఎకరాలు, సర్వే నెం.101 లో 273.34 ఎకరాలు.. వెరసి మొత్తం 550.39 ఎకరాల భారీ స్థలం.

1997 ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు తీర్పు: గతంలో ఈ స్థలాన్ని తమదేనంటూ క్లెయిమ్ చేసిన ప్రైవేట్ వ్యక్తులను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 1997 డిసెంబర్ 31న ‘భూకబ్జాదారులు’గా తేల్చింది.

2003 హైకోర్టు తీర్పు: దీనిపై ఆ వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా, 2003 ఏప్రిల్ 16న హైకోర్టు వారి 10 రిట్ పిటిషన్లను కొట్టివేసి భూములను హుడా/హెచ్ఎండీఏలకు అప్పగించింది.

సుప్రీంకోర్టులో సవాలు: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2003లో ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టులో 20 ఎస్ఎల్పీలు దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

జీపీఏల వాదన.. ప్రభుత్వ కౌంటర్!

ప్రైవేట్ వ్యక్తులైన పార్థసారథి, సువిశాల్ జైన్ తదితరులు కోర్టులో వాదిస్తూ.. పూర్వపు జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధమైన వారసుల నుంచి తాము ఈ భూములను ‘ఇర్రివోకబుల్ జీపీఏ’ (Irrevocable GPA), ‘సనద్’ హక్కుల ద్వారా పొందామని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు ఆ రిజిస్టర్డ్ జీపీఏలను రద్దు చేసే అధికారం లేదని వాదించారు.దీనికి ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ బలమైన ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు.

జాగీర్దార్ల రద్దు చట్టం సమయంలోనే అప్పటి జాగీర్దార్ కైసరుద్దీన్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారం చెల్లించింది.

పరిహారం తీసుకున్న తర్వాత ఆ భూములపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉండవని, కాబట్టి వారసులుగా చెప్పుకుంటున్న వారికి అమ్మే లేదా జీపీఏ ఇచ్చే అర్హత లేదని నిరూపించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. “కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఇలాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా కోర్టు అనుమతించబోదు.. ఇలాంటి తీవ్రమైన విషయాల్లో న్యాయస్థానం మౌనంగా ఉండదు” అని వ్యాఖ్యానిస్తూ ప్రైవేట్ వ్యక్తుల పిటిషన్లను తోసిపుచ్చింది.

ప్రభుత్వ వ్యూహం ఫలించింది: హెచ్ఎండీఏకు ఊరట

సుదీర్ఘ కాలంగా నలుగుతున్న ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. రెవెన్యూ విభాగం పక్కా రికార్డులతో రంగంలోకి దిగి సీనియర్ న్యాయవాదిని నియమించి కేసును వేగంగా విచారణకు తెచ్చింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన మియాపూర్ ప్రాంతంలో ఉన్న ఈ 550 ఎకరాల భూములు పూర్తిగా హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖ పరమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ ప్రకారం వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ప్రభుత్వ ఖజానాకు దక్కినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *