Operation Firewall

Operation Firewall: పాక్ గూఢచర్య ముఠా గుట్టురట్టు.. బీహార్‌లో ఇద్దరు నిందితుల అరెస్ట్..!

Operation Firewall: విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు నడిపిస్తున్న సరిహద్దు దాటిన గూఢచర్య నెట్‌వర్క్‌పై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ (APCIC) ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ రెండో దశలో భాగంగా అధికారులు బీహార్‌లోని నేపాల్ సరిహద్దు పట్టణమైన రక్సౌల్‌లో కీలక ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. భారతీయ సిమ్ కార్డులకు వచ్చే ఓటీపీలను (OTPs) పాక్ ఏజెంట్లకు చేరవేసి, అక్కడి నుంచి వాట్సాప్ అకౌంట్లు నడిపేందుకు సహకరించినట్లు వీరిపై అభియోగాలు నమోదయ్యాయి.

అరెస్టయిన రాజ్ కుమార్ (24), ఆదిత్య కుమార్ పాండే (23)లను విజయవాడలోని సంబంధిత న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి నవంబర్ 10 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఎలా నడిచింది ఈ దందా? ఓటీపీలతో వాట్సాప్ యాక్టివేషన్..

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
రక్సౌల్ టు పాకిస్తాన్: రక్సౌల్‌లో పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్, నేపాల్‌లోని మధ్యవర్తుల ద్వారా పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు భారతీయ మొబైల్ నంబర్ల ఓటీపీలను చేరవేసేవాడు.
భారత నంబర్లతో పాక్ వాట్సాప్: ఈ ఓటీపీల సాయంతో పాక్ గూఢచారులు భారతీయ నంబర్లపైనే వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసుకున్నారు. భారత్‌లోనే ఉంటున్నట్లు నమ్మించి అధికారులను బురిడీ కొట్టించేందుకు ఈ వ్యూహం పన్నారు.
బినామీ ఖాతాల్లో డబ్బులు: ఈ పని చేసినందుకు గాను మరొకరి పేరుతో తెరిచిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel Payments Bank) ఖాతా ద్వారా నిందితులకు పాక్ ఏజెంట్లు భారీగా నిధులు సమకూర్చారు.
మరో నిందితుడు ఆదిత్య పాండే: ఆదిత్య పాండే నేరుగా వసీం, సుల్తాన్, నయీమ్ అనే పాక్ ఏజెంట్లతో ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా టచ్‌లో ఉంటూ భారత సిమ్‌ల ఓటీపీలను పంపేవాడు. ఇతను కూడా ఇతరుల పేర్లతో ఉన్న బినామీ బ్యాంక్ ఖాతాల్లో భారీగా కమిషన్లు అందుకున్నాడు.

“సోనీ క్వీన్” హనీట్రాప్.. విశాఖ నేవీ రహస్యాల సేకరణ

నిందితులు యాక్టివేట్ చేసి ఇచ్చిన వాట్సాప్ నంబర్లతో పాకిస్తాన్ ఏజెంట్లు వైజాగ్‌లోని నేవల్ అధికారులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు:
“సోని/సోని క్వీన్” పేరుతో ఎర: ఒక మహిళా ప్రొఫైల్‌తో పాక్ ఏజెంట్, విశాఖలోని నేవీ అధికారుల వద్ద సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌ను సంప్రదించింది.

 

రహస్యాల లీక్: అతడి ద్వారా ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు చెందిన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ల కదలికలు, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు, సమాచారాన్ని ఆ ఏజెంట్ సేకరించింది.

 

“జోషితా పాల్” నెట్‌వర్క్: మరో పాక్ ఏజెంట్ “జోషితా పాల్” పేరుతో విశాఖలోని రక్షణ సిబ్బందికి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తూ కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

దేశద్రోహం, యూఏపీఏ కింద కేసు నమోదు..

ఈస్టర్న్ నేవల్ కమాండ్ పరిసరాల్లో పాక్ నిఘా విభాగం కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సెప్టెంబర్ 2నే APCIC కేసు నమోదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ కేసులో కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్ (అక్టోబర్ 1న అరెస్ట్), విశాఖ నేవల్ బేస్ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీ (అక్టోబర్ 3న కోయంబత్తూరులో అరెస్ట్) విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
బీహార్ ఏటీఎస్ (ATS), స్థానిక పోలీసుల సహకారంతో ఐదుగురు అనుమానితులను విచారించి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. తాజాగా రాజ్ కుమార్, ఆదిత్య పాండేలను కటకటాల్లోకి నెట్టారు. దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు కలిగించే ఈ భారీ రాకెట్ వెనుక ఉన్న ఇతర లింకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి ఏపీ పోలీసులు విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *