Bollywood

Bollywood: అందుకే అమీర్ ని వదిలేసి.. టైగర్ ష్రాఫ్‌ని లక్ష్యంగా చేసుకున్నాము

Bollywood: బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరమవగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని, బాలీవుడ్ అగ్ర నటుడు అమిర్ ఖాన్ అని పోలీసు వర్గాలు ప్రాథమిక విచారణలో గుర్తించాయి. అయితే అమిర్ ఖాన్ ఎక్కువగా ఇంటికే పరిమితమవ్వడం, బయటకు వచ్చినా కేవలం షూటింగ్‌లకే వెళ్తుండటంతో ఆ ప్రయత్నాలు ఫలించక చివరి నిమిషంలో షూటర్లు తమ ప్లాన్‌ను మార్చుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

నెల రోజుల రెక్కీ.. విఫలమైన ప్లాన్..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. హర్యానా నుంచి వచ్చిన ఇద్దరు షూటర్లు సెప్టెంబర్ 20న ముంబైకి చేరుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు నగరంలోనే మకాం వేసి అమిర్ ఖాన్ నివాస పరిసరాలను మూడుసార్లు రెక్కీ నిర్వహించారు. అయితే అమిర్ ఖాన్ షూటింగ్‌ల నిమిత్తం వెళ్లడం, తిరిగి రాగానే ఇంటి లోపలికే పరిమితమై రోజుల తరబడి బయటకు రాకపోవడంతో నిందితులకు ఆయనను టార్గెట్ చేయడం కష్టంగా మారింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో షూటర్లు తమ లక్ష్యాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
టైగర్ ష్రాఫ్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
అమిర్ ఖాన్‌తో పోలిస్తే యువ నటుడు టైగర్ ష్రాఫ్ కదలికలను ట్రాక్ చేయడం సులువని దుండగులు భావించారు. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం ఫుట్‌బాల్ ఆడేందుకు గ్రౌండ్‌కు క్రమం తప్పకుండా వస్తుండటాన్ని నిందితులు పసిగట్టారు. ఆయన బహిరంగంగా తిరిగే సమయాన్ని సులభంగా అంచనా వేయవచ్చని భావించి, అమిర్ ఖాన్‌కు బదులుగా టైగర్ ష్రాఫ్‌పై దాడికి తెగబడ్డారని దర్యాప్తులో తేలింది.
గతంలో బెదిరింపులు.. సల్మాన్‌కు కట్టుదిట్టమైన భద్రత
మరోవైపు, అమిర్ ఖాన్‌కు ఈ ఏడాది జులై నెలలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గౌరీ స్ప్రాట్‌తో ఆయన వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆ గ్యాంగ్‌కు చెందిన గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో ఆడియో క్లిప్, సందేశాల ద్వారా హెచ్చరించినట్లు తెలిసింది. ఆ బెదిరింపులకు, తాజా పరిణామాలకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, 2018 నుంచి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తున్న బిష్ణోయ్ ముఠా.. ఆయన చుట్టూ ఉన్న భారీ వై-ప్లస్ భద్రత కారణంగా ఏమీ చేయలేకపోయిందని, ఇప్పుడు ఇతర బాలీవుడ్ ప్రముఖులపై దృష్టి సారించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
టైగర్ ష్రాఫ్‌పై దాడి వెనుక అసలు ప్రణాళిక అమిర్ ఖాన్‌ను టార్గెట్ చేయడమేనని ముంబై పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిఘాకు చిక్కకుండా అమిర్ ఖాన్ ఇంటికే పరిమితం కావడంతో, సులభంగా కదలికలను గుర్తించవచ్చన్న ఉద్దేశంతోనే షూటర్లు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *