Hydraa: హైదరాబాద్ ఐటీ కారిడార్ మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ వాటర్ బిజినెస్‌పై ‘హైడ్రా’ (HYDRAA) అధికారులు శనివారం ఉదయం ఉక్కుపాదం మోపారు. సాధారణ ప్రజల హెల్త్‌తో ఆటలాడుకుంటూ, చెరువు చుట్టూ భూగర్భ జలాలను తోడేస్తున్న వాటర్ మాఫియా ఆగడాలకు అధికారులు ఫుల్స్టాప్ పెట్టారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా టీమ్ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టింది.
అసలేం జరిగింది? వీళ్ల ప్లాన్ ఏంటి?
సున్నం చెరువు పక్కనే ఉన్న బస్తీల్లోని ఇళ్లలో కొంతమంది వ్యాపారులు అక్రమంగా చాలా లోతైన బోర్లు వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా భూమి లోపల పెద్ద పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను సెట్ చేశారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లతో చెరువు నీటిని తోడేసి, నగరంలోని అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు.
పాయిజనస్ వాటర్.. పబ్లిక్ హెల్త్‌తో డేంజర్ గేమ్!
ఈ వ్యవహారంలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే.. సున్నం చెరువు చుట్టుపక్కల నీటిలో ప్రమాదకర రసాయనాలు, హానికర లోహాలు కలిసే అవకాశాలు ఎక్కువ. ఎలాంటి ఫిల్టరింగ్ లేదా శుద్ధి చేయకుండానే ఈ నీటిని నేరుగా ట్యాంకర్లలో నింపి అమ్ముతున్నారు. ఈ కలుషిత నీటిని వాడటం వల్ల స్కిన్ అలర్జీలు, కిడ్నీ సమస్యలు, తీవ్ర అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గుర్తించిన అధికారులు వెంటనే యాక్షన్‌లోకి దిగారు.
జేసీబీలతో స్పాట్లోనే క్లియర్.. గట్టి వార్నింగ్!
ఈ అక్రమ దందాను పక్కా సమాచారంతో పసిగట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందాలు.. అక్రమ బోరుబావులను సీజ్ చేశాయి. భూమి లోపల వేసిన పైప్లైన్లను జేసీబీలతో నేలమట్టం చేశాయి. కరెంట్ కనెక్షన్లను కట్ చేసి, పంపింగ్ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.
దశాబ్దాలుగా సాగుతున్న ఈ అక్రమ దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఐటీ హబ్‌తో పాటు నగరంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా చెరువులను ఆక్రమించి, సహజ వనరులను దోచుకుంటూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
మాదాపూర్ సున్నం చెరువు పరిసరాల్లో అక్రమంగా లోతైన బోర్లు వేసి, కలుషిత నీటిని ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్న వాటర్ మాఫియా నెట్‌వర్క్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. భూగర్భ జలాల దోపిడీని అడ్డుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి అక్రమ దందాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
