Fauzi

Fauzi: సుభాష్ చంద్రబోస్ ఎలివేషన్స్ తో ‘ఫౌజీ’ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్..!

Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘ఫౌజీ’ నుండి గ్లింప్స్ ని మూవీ టీమ్ విడుదల చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా సినిమా 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో ఈ సినిమాను 2026 డిసెంబరు 3న విడుదల చేయాలని భావించినప్పటికీ, నిర్మాణానంతర పనుల దృష్ట్యా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. దింతో అదే నెలలో రావాలనుకున్నస్పిరిట్ సినిమా అక్టోబర్ 29కి పోస్ట్ పోన్ అయింది.

‘ఫైల్ నెంబర్ 25’ పేరుతో విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. భారతదేశ విముక్తి పోరాటానికి జర్మనీ సహకరించాలని బోస్ కోరగా, రెండు శతాబ్దాలుగా బ్రిటిష్ పాలకుల అధీనంలో ఉన్న దేశ పోరాటానికి మద్దతు ఇవ్వలేనని హిట్లర్ సమాధానమిస్తాడు. దీనికి ప్రతిస్పందనగా నేతాజీ భారతీయ పరాక్రమాన్ని వివరిస్తూ, బ్రిటిష్ సైన్యానికి సైతం అంతుచిక్కని భారతీయ గూఢచారి ‘ఫౌజీ’ గురించిన రహస్యాన్ని వెల్లడిస్తారు.

భగవద్గీత కోడ్ భాష.. అంతుచిక్కని గూఢచారి..
సింగపూర్‌ను బ్రిటన్ నుంచి జపాన్ స్వాధీనం చేసుకోవడంలో ఫౌజీ పాత్రను వివరిస్తూ, అతడొక సైనికుడే కాక అద్భుతమైన వ్యూహకర్త అని బోస్ వివరిస్తారు. ముఖ్యంగా జర్మనీకి చెందిన ప్రసిద్ధ ‘ఎనిగ్మా’ కోడ్ కంటే ఎంతో కఠినమైన రహస్య కోడ్ భాషను భగవద్గీత తాత్వికత ఆధారంగా ఫౌజీ రూపొందించినట్లు, దానిని ఛేదించడం అసాధ్యమని బ్రిటిష్ అధికారులే అంగీకరించినట్లు టీజర్‌లో చూపించిన సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. బ్రిటిష్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్‌గా నమోదైన ఈ అసలు సిసలైన వీరుడి పేరు ఎవరికీ తెలియదని, ఆయన్నే ‘ఫౌజీ’ అని పిలుస్తారని ముగించడం ఆకట్టుకుంది.
భారీ తారాగణం – సాంకేతిక బృందం
1940ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం, సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్రిటిష్ పాలన కాలం నాటి దేశభక్తి, మానవీయ సంఘర్షణల కలయికగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.
ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ టీజర్ విడుదల అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ సంభాషణల నడుమ భారతీయ గూఢచారిగా ప్రభాస్ కనిపించనున్న ఈ పీరియాడిక్ డ్రామా 2027 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *