Pregnancy

Pregnancy Checklist: ప్రెగ్నెన్సీ టైమ్ లో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలివే!

Pregnancy Checklist: గర్భం దాల్చిన క్షణం నుంచి ప్రతి మహిళ జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలవుతుంది. ఈ సమయంలో వైద్య పరీక్షలు, రక్త నమూనాల విశ్లేషణ, స్కాన్లు, కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామాలంటూ ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా (పర్ఫెక్ట్‌గా) ఉండాలని ఆరాటపడుతూ చాలామంది మహిళలు తీవ్రమైన మానసిక ఆందోళనకు, అలసటకు గురవుతుంటారు. ప్రతీ అంశాన్ని ఆలోచించి ఒత్తిడి తెచ్చుకోవడం కంటే తల్లి, బిడ్డ సంరక్షణకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సూత్రాలపై దృష్టి సారిస్తే ప్రసవం సాఫీగా మారుతుందని పూణెకు చెందిన ప్రముఖ ప్రసూతి, స్త్రీవైద్య నిపుణులు డాక్టర్ రాఖీ వాఘ్ సూచిస్తున్నారు.

తప్పనిసరిగా పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు
వైద్య నిపుణుల సలహా ప్రకారం గర్భిణులు ప్రధానంగా నాలుగు విషయాలపై శ్రద్ధ వహించాలి..
  • క్రమం తప్పని ఆంటినాటల్ చెకప్‌లు: వైద్యులు సూచించిన షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లి చెకప్‌లు చేయించుకోవాలి. నిర్ణీత వారాల్లో రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు చేయించుకోవడం వల్ల పిండం ఎదుగుదల సజావుగా సాగుతోందో లేదో తెలుసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైనా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చు.
  • సమతుల్య ఆహారం, సప్లిమెంట్లు: గర్భధారణ సమయంలో పోషకాల అవసరం పెరుగుతుంది. రోజూ తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుదినుసులు, పాలు, తగినంత ప్రోటీన్ ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. వైద్యుల సూచన మేరకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, విటమిన్-డీ సప్లిమెంట్లను సమయానికి తీసుకోవాలి.
  • సురక్షిత వ్యాయామం, తగినంత నిద్ర: డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి సూచించనంత వరకు రోజూ చురుగ్గా ఉండటం మేలు చేస్తుంది. ప్రతిరోజూ తేలికపాటి నడక, గర్భిణులకు అనువైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. అలసటగా అనిపించినప్పుడు శరీరం చెప్పే మాట విని తగినంత విశ్రాంతి తీసుకోవడం, నాణ్యమైన నిద్ర పొందడం అత్యవసరం.
సోషల్ మీడియా సలహాలు, పోలికలు వద్దు
ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల్లో కనిపించే అన్ని సలహాలను గుడ్డిగా నమ్మకూడదు. వైద్యుడి సంప్రదింపులు లేకుండా ఎలాంటి మూలికా ఔషధాలు, కఠినమైన డైట్ ప్రణాళికలను అనుసరించవద్దు. అంతేకాకుండా మీ గర్భధారణను ఇతరులతో పోల్చుకోకూడదు. ప్రతి స్త్రీ శారీరక తత్వం వేరు కాబట్టి బరువు పెరగడం, లక్షణాలు, స్కానింగ్ వివరాలు ఒకరితో ఒకరికి భిన్నంగా ఉంటాయి.
ప్రసవానికి సంసిద్ధత – అత్యవసర సంకేతాలు
ప్రసవ నొప్పులు, తల్లిపాలు ఇవ్వడం, శిశు సంరక్షణపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. ప్రసవ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు తీసుకునే నిర్ణయాలకు మానసికంగా సిద్ధపడాలి. ముఖ్యంగా కడుపులో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, ఉమ్మనీరు కారడం, చూపు మసకబారడం, ఆకస్మికంగా కాళ్లలో వాపు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కడుపులో బిడ్డ కదలికలు తగ్గడం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
గర్భధారణ సమయంలో ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఒత్తిడి తెచ్చుకోకుండా, వైద్యుల సూచనల మేరకు సమతుల్య ఆహారం, నిరంతర ఆరోగ్య పరీక్షలు, అవసరమైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డలిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *