Ramayana Movie

Ramayana Movie: రూ.5000 కోట్లు వస్తే కానీ హిట్ కానీ రామాయణం..?

Ramayana Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక సినిమా ‘రామాయణ పార్ట్ 1: రైజ్ ఆఫ్ లెజెండ్’ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ బాక్సాఫీస్ వద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైనట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు, ముందస్తు బుకింగ్స్ అంచనాలపై సినీ వర్గాల్లో విస్తృత విశ్లేషణలు మొదలయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు అవసరం
సినిమా విడుదలకు దాదాపు రెండు వారాల ముందే ప్రారంభమైన ముందస్తు బుకింగ్స్ తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఇచ్చాయి. గురువారం నాటి లెక్కల ప్రకారం సుమారు 1.33 లక్షల టిక్కెట్లు అమ్ముడై రూ.7.52 కోట్ల గ్రాస్ వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో థియేటర్లు అందుబాటులోకి రాని నేపథ్యంలో, తొలిరోజు గరిష్ఠ వసూళ్లు సాధించాలంటే భారత్‌లో రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ ద్వారా మరో రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు సమకూరితే సినిమాకు మంచి ఊపు లభిస్తుందని ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా అంచనా వేశారు.
దక్షిణాది మార్కెట్ కీలకం
ప్రస్తుతం వస్తున్న వసూళ్లలో ఎక్కువ భాగం ఉత్తరాది నుంచే నమోదవుతుండగా, ఈ స్థాయి భారీ బడ్జెట్ సినిమాకు దక్షిణాది మార్కెట్ మద్దతు అత్యంత కీలకం. గతంలో ‘పుష్ప 2’ దేశీయ ముందస్తు బుకింగ్స్‌లో సాధించిన రూ.91 కోట్లలో సగానికి పైగా దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చాయి. ‘రామాయణ’ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు యశ్ క్రేజ్ ఉన్న కర్ణాటక మార్కెట్ల నుంచి కనీసం 35 నుంచి 40 శాతం ముందస్తు వసూళ్లు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశీయంగా తొలి రోజు రూ.100 కోట్ల నుంచి రూ.125 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్ల నుంచి రూ.200 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉంటుంది.
లాభాల బాట పట్టేదెలా?
సినిమా నిర్మాణం, ప్రచార వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, ట్రేడ్ లెక్కల ప్రకారం పెట్టిన రూ.2,000 కోట్ల పెట్టుబడికి 2.5 రెట్ల నిష్పత్తిలో బాక్సాఫీస్ గ్రాస్ సాధిస్తేనే బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశం ఉంటుందని సమాచారం. ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5,000 కోట్ల గ్రాస్ సాధించడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమూ అతిపెద్ద సవాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే థియేట్రికల్ వసూళ్లతో పాటు డిజిటల్ ఓటీటీ హక్కులు, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల విక్రయం ద్వారా కూడా నిర్మాతలు పెట్టుబడిని రికవరీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
రూ.2,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూలు చేయాల్సి ఉంటుంది. ముందస్తు బుకింగ్స్, తొలిరోజు ఓపెనింగ్స్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకుల ఆదరణ, బలమైన మౌత్ టాక్ మాత్రమే ఈ పౌరాణిక దృశ్యకావ్యాన్ని బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌లోకి చేర్చగలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *