Kalki 2898: ఆక్టోబర్ 23 ఇది ఒక్క డేట్ మాత్రమే కాదు ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కూడా.. నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్, పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్‌ల నుంచి వచ్చే క్రేజీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ యూనిట్ పోస్టర్లతో సర్ప్రైజ్ చేయగా, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి సాలిడ్ బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది.
రెండో భాగం షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు అడుగుపెడతారా అని ఆసక్తిగా చూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ ఒక ప్రత్యేక బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను విడుదల చేశారు. కెమెరా వెనుక మూవీ యూనిట్ పడుతున్న శ్రమతో పాటు, ప్రభాస్ మళ్లీ తన ఐకానిక్ ‘భైరవ’ అవతారంలో సెట్స్‌లోకి అడుగుపెట్టే పవర్ఫుల్ విజువల్స్‌ను ఇందులో చూపించారు. ప్రొడక్షన్ టీమ్ భారీ సెట్‌ను సిద్ధం చేయడం, ఆ తర్వాత ప్రభాస్ భైరవ సిగ్నేచర్ లుక్‌లో సెట్స్‌పైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్‌ను ‘సూపర్‌హీరో ఆఫ్ ఇండియన్ సినిమా’, ‘డార్లింగ్ ఆఫ్ ఎవ్రీ జనరేషన్’ అంటూ బర్త్‌డే ట్రిబ్యూట్ అందించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్లో భారతీయ సినీ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరింత కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా, రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని విశేష ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ సైతం అంతకుమించిన భారీ స్కేల్లో తెరకెక్కుతున్నట్లు తాజా వీడియో స్పష్టం చేస్తోంది.
