IND vs NZ

IND vs NZ: 226 పరుగుల భారీ టార్గెట్ ఫినిష్.. తొలి టీ20లో కివీస్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!

IND vs NZ: క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ మైదానంలో పరుగుల వరద పారిన తొలి టీ20 సమరంలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిథ్య కివీస్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే (19.4 ఓవర్లలోనే) అలవోకగా ఛేదించారు. ఈ ఉత్కంఠభరిత గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సంజు – అభిషేక్ మెరుపు ఆరంభం – 5.5 ఓవర్లలోనే 93 పరుగులు!

226 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రాకెట్ వేగంతో కూడిన ఆరంభాన్ని ఇచ్చారు.. ఓపెనర్లుగా వచ్చిన సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే కివీస్ పేసర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దింతో కేవలం 5.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు ఏకంగా 93 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్‌ను పూర్తిగా భారత నియంత్రణలోకి తెచ్చారు.
23 బంతుల్లోనే సంజు ఫిఫ్టీ – నమన్ ధీర్ ఫినిషింగ్ టచ్.. 
టాప్ ఆర్డర్‌లో సంజు ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు.. మొత్తం 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఈ ఇన్నింగ్స్ భారత విజయానికి బలమైన పునాది వేసింది.
కీలక ఇన్నింగ్స్ ఆడిన నమన్ ధీర్..
మిడిలార్డర్‌లో వచ్చిన యువ సంచలనం నమన్ ధీర్ (42) ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా దూకుడుగా ఆడాడు. వరుస బౌండరీలతో అవసరమైన రన్‌రేట్‌ను నియంత్రణలో ఉంచుతూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లలో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, భారత బ్యాటర్లు సంయమనం కోల్పోకుండా 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు నింపారు. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, బ్యాటర్లు చూపిన అసాధారణ తెగువతో టీమిండియా సిరీస్‌లో శుభారంభం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *