Chandrababu Naidu

Chandrababu: : 2024 కంటే ఓట్ల శాతం పెరగాలి.. నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వ్యూహాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కీలక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ రీ-ఇంజినీరింగ్ విధానం ద్వారా అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. టీడీపీ తరఫున పోటీ చేసే 11 మేయర్ స్థానాలను 11 విభిన్న సామాజిక వర్గాలకు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని వివరించారు. క్షేత్రస్థాయిలో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో మిత్రధర్మాన్ని పాటిస్తూ సమన్వయంతో కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

 

2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఫలితాలను మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలని, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఏకపక్షంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రజల నాడి, పార్టీ కేడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని, ఎక్కడైనా చిన్నపాటి అసంతృప్తులు ఉంటే వాటిని స్థానికంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తోందని, అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *