Hyderabad Dasara Traffic: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడితో పాటు వారాంతపు (వీకెండ్) సెలవులు కూడా కలిసిరావడంతో భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తమ సొంతూళ్లకు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని ప్రధాన జాతీయ రహదారులు, నగరంలోని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65 (NH-65) పై వాహనాల రద్దీ ఊహించని రీతిలో పెరిగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు బారులు తీరి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
పంతంగి వద్ద కిలోమీటర్ల కొద్దీ జామ్ – కారణాలేంటి?
హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వెళ్లే వేలాది వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పంతంగి టోల్గేట్ వద్ద పరిస్థితి దారుణంగా మారింది. రద్దీకి తోడు అనేక వాహనాల ఫాస్టాగ్ (FASTag) అకౌంట్లలో సరిపడా బ్యాలెన్స్ లేకపోవడం, కొన్ని గేట్ల వద్ద స్కానర్లు స్లోగా పనిచేస్తూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కో వాహనం గేటు దాటడానికి ఎక్కువ సమయం పడుతోంది.
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల అడ్డంకి..
జాతీయ రహదారిపై చౌటుప్పల్ పరిసరాల్లో పలుచోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతుండటంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాలు చాలా నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో చౌటుప్పల్ దాటడానికే వాహనదారులకు గంటల కొద్దీ సమయం పడుతోంది.
ట్రాఫిక్ పోలీసుల అలర్ట్ – ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లింపు..
రహదారిపై ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేయడానికి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.. హైదరాబాద్ నుంచి విజయవాడ, సూర్యాపేట వైపు వెళ్లే ప్రైవేట్ వాహనాలను చౌటుప్పల్ పరిధిలోని లక్కారం గ్రామం వద్ద నుంచి వలిగొండ మీదుగా చిట్యాల చేరుకునేలా దారి మళ్లిస్తున్నారు. ప్రయాణానికి బయలుదేరే ముందే ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకోవాలని, అదనపు ప్రయాణ సమయాన్ని కేటాయించుకోవాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అటు ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై కూడా భువనగిరి సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది.
బస్టాండ్లలో పండుగ జాతర – టీజీఎస్ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులు..
నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS) ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం, ఆదివారం ప్రయాణాల రద్దీ పీక్స్‌కు చేరుకోనుందని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేసింది..
7,000 ప్రత్యేక సర్వీసులు..
పండుగ రద్దీని తట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి సుమారు 7 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
శివారు ప్రాంతాల నుంచే బస్సులు..
ప్రధాన బస్టాండ్లపై ఒత్తిడి తగ్గించేందుకు నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ (KPHB), గచ్చిబౌలి, బోయిన్పల్లి పాయింట్ల నుంచే నేరుగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించారు. ప్రయాణికులు ఎంజీబీఎస్ వరకు రాకుండా తమకు దగ్గరలోని పాయింట్ల వద్దే బస్సులను ఎక్కవచ్చని అధికారులు తెలిపారు.
మహాలక్ష్మి పథకం వర్తింపు..
పండుగ సందర్భంగా నడిపే ఆర్టీసీ ప్రత్యేక పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథాతథంగా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మహిళా ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చింది. రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు, బస్టాండ్లలో విపరీతమైన రద్దీ ఉన్నందున.. ప్రజలు తమ ప్రయాణ వివరాలను ముందే సరిచూసుకుని, తగిన జాగ్రత్తలతో సొంతూళ్లకు బయలుదేరాలని రవాణా, పోలీస్ శాఖలు సూచిస్తున్నాయి.
