K. Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర స్థాయి మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒకేసారి అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు తన సొంత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ బాంబు పేల్చారు.
హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు, కుటుంబంలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై ఓపెన్‌గా మాట్లాడి అందరినీ షాక్‌కు గురిచేశారు.
ఎల్‌నినో ముప్పు 10 నెలల ముందే చెప్పినా నిద్రపోయారా?.. రేవంత్‌పై కవిత ధ్వజం
రాష్ట్రంలో తీవ్రమవుతున్న సాగునీరు, తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వాన్ని కవిత సూటిగా నిలదీశారు .. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి నీటి కష్టాలు వస్తాయని వాతావరణ శాఖ దాదాపు 10 నెలల ముందే హెచ్చరించింది. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ కనీస ముందస్తు ప్రణాళికలు వేసుకోకుండా నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సిగ్గులేకుండా రైతులకు ‘పంటలు వేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డి సలహాలు ఇవ్వడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యం” అని మండిపడ్డారు.
30 నెలలు గడిచినా పాత పాటలేనా?..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 30 నెలలు పూర్తవుతున్నా.. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాక, ఇప్పటికీ ప్రతి చిన్న విషయానికి పాత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేయడం తప్ప వీరు చేసిందేమీ లేదని విమర్శించారు.
పాలమూరు ప్రాజెక్టులు ఏమయ్యాయి?..
ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మిషన్ భగీరథను సక్రమంగా మెయింటైన్ చేసి గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డపై క్లారిటీ ఏది?..
మేడిగడ్డ బ్యారేజీకి అసలు మరమ్మతులు చేపట్టి నీటిని నిల్వ చేస్తారా లేక ఇంకా గత పాలకుల మీద ఏడుస్తూనే కాలం వెల్లదీస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తోడబుట్టిన నన్ను కిరాయి మనుషులతో తిట్టిస్తున్నాడు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత!
ఈ ప్రెస్మీట్లో కవిత సొంత అన్న కేటీఆర్‌పై చేసిన వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తోడబుట్టిన సొంత చెల్లెలిని కూడా కిరాయి మనుషులను పెట్టి సోషల్ మీడియాలో అసభ్యంగా తిట్టించే అత్యంత నీచమైన సంస్కృతి కేటీఆర్‌ది” అంటూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల అక్రమ మోటార్లు..
“ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు భారీ మోటార్లతో నీటిని తరలిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ.. పలువురు అధికార పక్ష ఎమ్మెల్యేల పొలాలకు మాత్రం అక్రమంగా భారీ మోటార్లు బిగించి నీటిని మళ్లిస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉంది” అంటూ బాంబు పేల్చారు. ఒకవైపు రాష్ట్రంలో నీటి సంక్షోభంపై పాలకులను టార్గెట్ చేస్తూనే, మరోవైపు కుటుంబంలోని పొలిటికల్ గ్యాప్‌ను మీడియా ముందే రచ్చకెక్కించిన కవిత వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
