TG News: తెలంగాణ పారిశ్రామిక రంగానికి మరో భారీ ఊపు లభించింది. ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) చాంగ్యో చో నేతృత్వంలోని బృందం ప్రత్యేకంగా భేటీ అయింది.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)లో అత్యాధునిక ఆర్ అండ్ డీ (పరిశోధన, అభివృద్ధి) ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4,275 మంది యువతకు కొత్తగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అత్యాధునిక టెస్ట్ ట్రాక్, పైలట్ ప్రొడక్షన్ లైన్, ప్రొటోటైపింగ్ ప్లాట్‌ఫామ్‌లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, పరిశోధనా కేంద్రం స్థాపనకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను సత్వరమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అత్యంత సానుకూల వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు వివరించారు. కేవలం పరిశోధన, అభివృద్ధి కేంద్రానికే పరిమితం కాకుండా, భవిష్యత్తులో హ్యుందాయ్ కార్ల తయారీ యూనిట్‌ను (Car Manufacturing Plant) కూడా తెలంగాణలోనే స్థాపించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కంపెనీ మేనేజ్మెంట్ను కోరారు.
