Droupadi Murmu

Droupadi Murmu: ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

Droupadi Murmu: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అంతరాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ పట్టువస్త్రాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులకు నమస్కరిస్తూ రాష్ట్రపతి ఆలయంలోకి ప్రవేశించారు.

పున్నమి ఘాట్‌లో ‘జాతీయ సరస్ మేళా’ అట్టహాసంగా ప్రారంభం..

దుర్గమ్మ దర్శనం అనంతరం కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రతిష్ఠాత్మక ‘జాతీయ సరస్ మేళా’ను అధికారికంగా ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన 650 స్టాళ్లను రాష్ట్రపతి పరిశీలించి, గ్రామీణ మహిళల ప్రతిభను కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ జాతీయ స్థాయి మేళా నిర్వహించేందుకు అంగీకరించినందుకు రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రపతి ముర్ము ప్రయాణం నారీశక్తికి నిదర్శనం.. సీఎం ప్రశంసలు
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ..ఒక మారుమూల గిరిజన గ్రామంలో, పేద కుటుంబంలో పుట్టి.. జీవితంలో ఎదురైన తీవ్ర కష్టాలను తట్టుకుని దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిరోహించిన ద్రౌపదీ ముర్ము ప్రయాణం దేశంలోని ప్రతి మహిళకు గొప్ప ఆదర్శం. మహిళలు సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆమె నిరూపించారు” అని కొనియాడారు.

 

మహిళా శక్తికి వేదికగా సరస్ మేళా..
గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడం, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే ఈ మేళా ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే సమాజం పురోగమిస్తుందని స్పష్టం చేశారు.
డ్వాక్రా విప్లవం నుంచి రూ.10 లక్షల కోట్ల టర్నోవర్ వైపు..
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంఘాల ప్రస్థానాన్ని, భవిష్యత్ లక్ష్యాలను సీఎం ఆవిష్కరించారు.. ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన ‘డ్వాక్రా’ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు రూ.69 లక్షల కోట్ల రుణాలు పొందుతూ, లక్ష కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతున్నాయని.. త్వరలోనే ఈ టర్నోవర్‌ను రూ.10 లక్షల కోట్లకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రతి ఇంటి నుంచి ఓ మహిళా ఎంట్రప్రెన్యూర్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 6 కోట్ల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తున్నారని, అదే స్ఫూర్తితో ఏపీలో త్వరలోనే 10 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *