CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఇరు రాష్ట్రాల రాజకీయ ఈ పర్యటన విశేష ఆసక్తిని రేకెత్తించింది.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా.. సీఎం విజయ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రి నారాయణ ఘన స్వాగతం..
చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్‌కు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
ఎయిర్‌పోర్టు వద్ద అభిమానుల సందడి..
తమ అభిమాన నటుడు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు ఎయిర్‌పోర్టు ప్రాంగణానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం అక్కడి నుంచి భారీ భద్రత నడుమ ఆయన నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.
ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం – వేదాశీర్వచనం..
మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం విజయ్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ పాలకమండలి, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు.
మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిలతో కలిసి విజయ్ గర్భాలయంలో అన్నపూర్ణా దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు సీఎం విజయ్‌కు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలతో పాటు కనకదుర్గమ్మ దివ్య చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.
పున్నమి ఘాట్‌లో ‘విజయవాడ ఉత్సవ్ 2.0’..
అమ్మవారి దర్శనం ముగించుకున్న అనంతరం తమిళనాడు సీఎం విజయ్ కృష్ణా నదీ తీరాన ఉన్న పున్నమి ఘాట్‌కు బయలుదేరారు. అక్కడ వైభవంగా నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మంగళవారం రాత్రి 9 గంటలకు విజయ్ గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి చెన్నైకి పయనం కానున్నారు.
