Rahul Gandhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చెలరేగిన రాజకీయ సెగలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎన్నికల వ్యవస్థల్లో జరిగిన భారీ “ఓటు చోరీ”కి, ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అక్రమాలకు వ్యతిరేకంగా విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి నేతలు సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు వరకు మహాపాదయాత్ర నిర్వహించి, కోర్టులో అధికారికంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.
ఢిల్లీలో 30 వేల మంది పోలీసులు.. ఇంత భయం ఎందుకు?.. రాహుల్ ప్రశ్నలు
ఢిల్లీ రోడ్లపై కేంద్ర ప్రభుత్వం సృష్టించిన నిర్బంధ పరిస్థితులను రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. దేశ రాజధాని రోడ్లపై దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని, భయానక పరిస్థితులను సృష్టించారు. ఢిల్లీ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ (CRPF), ఐటీబీపీ (ITBP) బలగాలను కూడా రప్పించారు. దేశభక్తులైన యువత, విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
మహిళలు, యువతపై దాడులు..
బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు మహిళలు, యువకులపై భౌతిక దాడులకు దిగుతున్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఉన్న స్వేచ్ఛ దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఎందుకు లేదని ఆయన నిలదీశారు.
మోదీకి సీఈసీపై ఎందుకంత ప్రేమ?..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కాపాడటానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు? ఆయనను వెనుకేసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీపై దేశ ప్రజల్లో గత 12 ఏళ్లుగా ఉన్న తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రజా ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
సీజేఐ భేటీ నిరాకరణ – నేరుగా సుప్రీంకోర్టులోనే న్యాయపోరాటం..
న్యాయవ్యవస్థను ఆశ్రయించే అంశంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..
-
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని చెప్పేందుకే తాము సీజేపీ (CJP)కి బాసటగా నిలిచామని, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి ఆధారాలు ఇవ్వాలని అపాయింట్మెంట్ కోరామని తెలిపారు.
-
అయితే తమ అభ్యర్థనను సీజేఐ తిరస్కరించిన నేపథ్యంలో.. తాము రాజ్యాంగబద్ధమైన న్యాయపోరాటాన్ని నేరుగా కోర్టు గడప తొక్కడం ద్వారానే ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
-
“జంతర్ మంతర్ అనేది ప్రజల నిరసనలకు నిర్దేశించిన పవిత్ర స్థలం. అక్కడికి ఎవరినీ వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ బారికేడ్లతో అడ్డుకుంటున్నారు. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము తగ్గేది లేదు” అని తేల్చిచెప్పారు.
నేడు మధ్యాహ్నం సుప్రీంకోర్టుకు మార్చ్ – 3 గంటలకు పిటిషన్..
ఇండియా కూటమి తరఫున కార్యాచరణను ప్రకటిస్తూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు:
-
బారాఖంభా జంక్షన్ నుంచి పాదయాత్ర:సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు కన్నాట్ ప్లేస్ సమీపంలోని బారాఖంభా జంక్షన్ నుంచి ఇండియా కూటమి నేతల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వైపు భారీ నిరసన పాదయాత్ర ప్రారంభమవుతుంది.
-
మధ్యాహ్నం 3 గంటలకు పిటిషన్ దాఖలు:సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఎన్నికల అక్రమాలపై సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రజాప్రయోజన పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు.
-
బీజేపీ వాళ్లయినా రండి:“ఇది రాహుల్ గాంధీకో, నరేంద్ర మోదీకో సంబంధించిన వ్యక్తిగత అంశం కాదు. ఇది మీ భవిష్యత్తు, మన దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునే మహోద్యమం. ఒకవేళ బీజేపీకి చెందిన వ్యక్తులైనా రాజ్యాంగం ప్రమాదంలో ఉందని భావిస్తే నిస్సంకోచంగా మాతో కలిసి నడవొచ్చు. రాలేని వారు మధ్యాహ్నం 3 గంటలకు సంఘీభావం తెలపండి” అని కోరారు.
కేంద్ర ప్రభుత్వంలోని 200 మంది అధికారులు మా టచ్‌లోనే ఉన్నారు..
ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ చేసిన మరో వ్యాఖ్య తీవ్ర సంచలనం సృష్టిస్తోంది:
-
“మోదీ ప్రభుత్వంలో పనిచేస్తున్న 200 మంది అధికారులు నేరుగా మాతో టచ్‌లో ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో నిరంతరం మాకు పూర్తి సమాచారం అందిస్తున్నారు.”
-
“విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిలో 50 శాతం మంది మేము చేస్తున్న పోరాటం సరైనదేనని మాకు మద్దతు పలుకుతున్నారు. దేశ ప్రజలు, జవాన్లు, పోలీసులు అంతా ఒకవైపు ఉంటే.. మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, జ్ఞానేష్ కుమార్ మరియు ఎన్నికల సంఘంలోని కొందరు మాత్రమే మరోవైపు ఉండి వ్యవస్థలను హైజాక్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతమంది పోలీసులను మోహరిస్తే, అంతగా మా ఉచ్చులో మరింత కూరుకుపోతుంది” అని హెచ్చరించారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేసి, నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. ఇప్పుడు ఇండియా కూటమి అగ్రనేతలు సుప్రీంకోర్టు ముట్టడి తరహాలో పాదయాత్రకు పిలుపునివ్వడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా డైవర్షన్లు, ఆంక్షలు విధించారు. దేశ రాజధానిలో రాజకీయం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది.
