Mahanandi

Mahanandi: భృంగి వాహనంపై శైలపుత్రిగా దర్శనమిచ్చిన శ్రీ కామేశ్వరి అమ్మవారు..!

Mahanandi: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ చంద్రమౌళీశ్వర రెడ్డి పర్యవేక్షణలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, అనుజ్ఞ, దీక్షాధారణ, రుత్విగ్వరణ, అఖండ దీప స్థాపన, అగ్నిప్రతిష్టాపన, నవదుర్గ కలశ స్థాపన పూజలు జరిగాయి. అలాగే గోమాతకు పట్టువస్త్రాలు సమర్పించి, మేళతాళాల నడుమ విశేష పూజలు చేయడంతో మహానంది క్షేత్రమంతా వేదమంత్రాల ఘోషతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఉత్సవాల తొలి రోజు రాత్రి అమ్మవారికి కనులపండువగా సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ కామేశ్వరి అమ్మవారు ‘శైలపుత్రి’ దివ్యాలంకారంలో భృంగి వాహనంపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భృంగి వాహనంపై పురవీధుల్లో విహరించిన జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *