Rahul Gandhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రాజుకున్న రాజకీయ మంటలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఒకవైపు జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో పోలీసుల భారీ నిర్బంధాలు కొనసాగుతుండగానే.. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశ యువత చేస్తున్న పోరాటాన్ని చూసి తాను గర్వపడుతున్నానని, యువత తమ ఆందోళనలను ఆపవద్దని, వారి వెనుక తాము పూర్తిస్థాయిలో కొండంత అండగా నిలబడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మిస్టర్ మోదీ.. ఏం చేసుకుంటారో చేసుకోండి!”: రాహుల్ గాంధీ సవాల్..
కేంద్ర ప్రభుత్వ నిర్బంధ విధానాలపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మిస్టర్ మోదీ.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి! 10 వేలా, 20 వేలా, 50 వేల మంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి. నేతలందరినీ, ఆందోళన చేస్తున్న యువకులందరినీ అరెస్టు చేసుకోండి. మేము మాత్రం అంగుళం కూడా వెనక్కి తగ్గం. మిమ్మల్ని నలువైపులా కమ్మేస్తాం” అని రాహుల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కీలక సమాచారం మా దగ్గర ఉంది..
ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) వ్యవహారంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కీలక సమాచారం ఇప్పటికే తమ వద్ద ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కుట్రలను ప్రజల ముందు ఎండగడతామని తెలిపారు.
రాజ్యాంగాన్ని కాపాడి తీరుతాం..
“గత 15 ఏళ్లలో ఈ దేశానికి ఏం జరిగిందో.. అది మళ్లీ జరగనివ్వం. రాజ్యాంగంపై దాడికి దిగిన పాలకులను గద్దె దించి తీరుతాం. మోదీ ప్రభుత్వం పోవాల్సిందే, జ్ఞానేష్ కుమార్ దిగిపోవాల్సిందే.. ఆ తర్వాతే ప్రజాస్వామ్య వ్యవస్థల పునర్నిర్మాణం మొదలవుతుంది” అని కుండబద్దలు కొట్టారు.
మోదీ, ఆర్ఎస్ఎస్ అసలైన నైజం పిరికితనం..
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల దాడిని తీవ్రతరం చేస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు:
దశాబ్దపు పోరాటం..
“మోదీ, ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలంపై నేను దశాబ్దానికి పైగా ఒంటరి పోరాటం చేస్తున్నా. వారిని నేను అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేరు. ఈ ప్రజాస్వామ్య విధ్వంస కథలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ అసలైన విలన్లు.”
భయమే వారి బలహీనత..
“ప్రజలను, నిరసనకారులను అణచివేసేందుకు ఇంత పెద్ద ఎత్తున బలగాలను దింపడమే వారి పిరికితనానికి నిదర్శనం. మోదీ, ఆర్ఎస్ఎస్ అసలైన లక్షణం పిరికితనం మాత్రమే” అని ఎద్దేవా చేశారు.
కన్నాట్ ప్లేస్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు – అడుగడుగునా నిర్బంధాలు..
మరోవైపు న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ (Connaught Place) పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
గుంపులుగా వస్తున్న కార్యకర్తలు:
జంతర్ మంతర్ పరిసరాల్లో బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ, సీజేపీ కార్యకర్తలు, యువత గుంపులు గుంపులుగా కన్నాట్ ప్లేస్ వైపు తరలివస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.
పోలీసుల వేట – పీఎస్‌లకు తరలింపు:
జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న యువకులను, నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
మెట్రో స్టేషన్ల మూసివేత, భారీ పోలీస్ బందోబస్తుతో ఢిల్లీ నడిబొడ్డున ఎటుచూసినా సైనిక వాతావరణం నెలకొంది. యువత తిరుగుబాటుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేత రాహుల్ గాంధీ బాహాటంగా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో.. ఈ వ్యవహారం కేంద్ర వర్సెస్ విపక్షాల మధ్య ప్రత్యక్ష సమరంగా మారింది.
