Kamal Hasan 

Kamal Haasan: కమల్ హాసన్ దెబ్బ.. ఎలాన్ మస్క్ అబ్బా

Kamal Haasan: భారతదేశ అంతర్గత విధానాలు, దేశీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఎలాన్ మస్క్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ‘స్టార్‌లింక్’ (Starlink) అనుమతులు ఆలస్యం కావడంపై నిరాశతో.. “ముకేశ్ అంబానీనే భారత్‌కు అసలైన బాసా?” అంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్ ఒక స్వతంత్ర ప్రజాస్వామ్య దేశమని, ఏ బిలియనీర్ కూడా ఒక దేశ సార్వభౌమ విధానాలను నిర్దేశించలేరని స్పష్టం చేశారు.

భారత్ ఒక కాలనీ కాదు.. కమల్ హాసన్ స్ట్రాంగ్ పంచ్

ఎలాన్ మస్క్ పోస్టుకు స్పందిస్తూ ఎంపీ కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. భారతీయుడైనా, అమెరికన్ అయినా.. ఏ ఒక్క బిలియనీర్ కూడా ఒక దేశ పాలసీలను శాసించలేరు. శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో భారతీయ, గ్లోబల్ సంస్థల మధ్య పోటీని భారత్ ఆహ్వానిస్తుంది. అయితే మారుమూల ప్రాంతాల్లోని సామాన్యులకు అది అందుబాటు ధరలో ఉండాలి తప్ప, భారీ రుసుములతో డిజిటల్ అసమానతలను పెంచకూడదు అని పేర్కొన్నారు.

జాతీయ భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు..
“దేశ నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్ అనేవి కేవలం వ్యాపార వనరులు మాత్రమే కాదు.. అవి వ్యూహాత్మక జాతీయ మౌలిక వసతులు. భారత జాతీయ భద్రతా నిబంధనల్లో ఎలాంటి రాజీ ఉండదు.
స్వేచ్ఛా మార్కెట్ల గురించి ఉపన్యాసాలు ఇచ్చే పశ్చిమ దేశాలు.. స్వదేశంలో మాత్రం రక్షణాత్మక విధానాలను (Protectionism) అమలు చేస్తున్నాయి. చైనా ఎలక్ట్రిక్ కార్లపై అమెరికా 100 శాతం దిగుమతి సుంకాలు విధించినప్పుడు లేని నిబంధనలు భారత్‌కు వర్తించవా? తమ దేశీయ పరిశ్రమలను కాపాడుకునే హక్కు భారత్‌కు కూడా ఉంది. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం.. ఎవరి వలస రాజ్యమో (Colony) కాదు. ప్రపంచాన్ని మేం ఆహ్వానిస్తాం.. కానీ మా భవిష్యత్తును భారతీయులమైన మేమే నిర్ణయించుకుంటాం” అని కమల్ హాసన్ తేల్చిచెప్పారు.

చైనాలో మాట్లాడటానికి ఎందుకు భయం? – రచయిత రాజీవ్ మల్హోత్రా సూటి ప్రశ్నలు

 చైనాలో ఎందుకు నోరు మెదపరు?:
టెస్లా తరఫున చైనాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఎలాన్ మస్క్.. అక్కడ స్టార్‌లింక్‌ను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అడుగుపెట్టనివ్వకపోతే ఒక్క మాటా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చైనా నియంతృత్వ విధానాలపై నోరు విప్పని మస్క్.. ప్రజాస్వామ్య భారత్‌లో పారదర్శక నిబంధనలను ఎందుకు తప్పుపడుతున్నారని నిలదీశారు.
స్పెక్ట్రమ్ అనేది సార్వభౌమాధికారం:
స్టార్‌లింక్ వివాదం కేవలం టెక్నాలజీ, సేవా నాణ్యతకు సంబంధించినది మాత్రమే కాదని.. ఒక దేశ డేటా భద్రత, సార్వభౌమాధికారంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని మల్హోత్రా పేర్కొన్నారు.
క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
మస్క్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార, టెలికాం వర్గాలు అధికారిక వివరణ ఇచ్చాయి:
శాటిలైట్ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న స్టార్‌లింక్, జియో సాట్‌కామ్ (Jio Satcom), యూటెల్‌శాట్ వన్‌వెబ్ (Eutelsat OneWeb).. ఈ మూడు సంస్థల విషయంలోనూ భద్రతా మదింపు (Security Assessment) సమానంగా జరుగుతోందని తెలిపింది.
ఏ ఒక్క సంస్థకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం లేదని, మూడు సంస్థలు రెగ్యులేటరీ ప్రక్రియలో ఒకే దశలో ఉన్నాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీ క్లియరెన్స్ పూర్తయిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపు తదుపరి దశకు చేరుకుంటుందని కేంద్రం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *